కవాడిగూడ, ఏప్రిల్ 11: సేంద్రియ ఎరువులను వాడుకొని భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రపంచ భూ దినోత్సవం సందర్భంగా కవాడిగూడలోని ఇంగ్లిష్ యూనియన్ హైస్కూల్లో ‘సేవ్ సాయిల్’ అనే అంశంపై విద్యార్థులు సారవంతమైన భూమి చిత్రాలు వేసి రసాయన ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌రెడ్డి హాజరై విద్యార్థులు వేసిన చిత్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధిక దిగుబడిని ఆశించి రసాయన ఎరువులు వా డడంతో సూక్ష్మ జీవులు నశించిపోయి మొక్కలకు సరైన పోషకాలు అందడం లేదని అన్నారు. దీంతో పండిన పంటలలో పోషక విలువలు తక్కువ శాతం తో ఉంటున్నాయని అన్నారు. అలాంటి ఆహారం తీసుకోవడం వలన ప్రజలు రకరకాల వ్యాధులకు గురికావాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్క మానవుడు మేల్కొని ఈ భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సారవంతమైన భూమిని కాపాడుకోవాలని విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీకి ఆన్లైన్లో లేఖను పంపించారు.