ప్రభుత్వ దవాఖానలో అన్ని వసతులు
57 రకాల వైద్య పరీక్షలు..
సిబ్బందితో నిరంతర సేవలు
అల్లాపూర్, మార్చి19: అల్లాపూర్ డివిజన్ పర్వత్‌నగర్ ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల సౌకర్యాలతో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. 6 పడకలతో దవాఖానను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు. 57 రకాల వైద్యపరీక్షలు అందుబాటులో ఉండడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతున్నది.
నిరంతరం సేవలు..
దవాఖానలో గైనకాలజిస్ట్ డాక్టర్ కోమల్ తారక, ఇద్దరు నర్సులు, ఒక ఫార్మసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక డీఈవో, నలుగురు ఏఎన్ఎంలతో కలిపి 11 మంది సేవలందిస్తున్నారు. ప్రతి బుధవారం, శనివారం చిన్నపిల్లలకు టీకాలు, సోమవారం, శుక్రవారం సుమారు 50 మంది గుర్భిణులకు పరీక్షలు నిర్వహిస్తారు. గురువారం వృద్ధులకు షుగర్, బీపీ పరీక్షలు చేసి మందులను అందజేస్తారు. వీటితో పాటు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, కొవిడ్ వ్యాక్సినేషన్ కూడా అందుబాటులో ఉంది. నిత్యం ఉదయం 9నుంచి సాయంత్రం 4వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి.
నెలకు 15 వరకు సాధారణ ప్రసవాలు..
నెలకు దాదాపు 15 వరకు సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. అల్లాపూర్ డివిజన్లో అత్యధికంగా మురికివాడలు ఉడడంతో వివిధ బస్తీల నుంచి గర్భిణులు వస్తున్నారు. ఏదైనా అత్యవసరం అనిపిస్తే ఇక్కడ నుంచి అంబులెన్స్‌లో కొండాపూర్ టీమ్స్, గాంధీ వంటి ప్రసూతి దవాఖానలకు తరలిస్తారు.
శుభ్రతకు పెద్దపీట..
మొదటగా దవాఖానలో సమస్యలు లేకుండా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిధులు కేటాయించి చర్యలు తీసుకుంటున్నారు. ల్యాబ్‌లో 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. డివిజన్ నుంచి పెద్ద ఎత్తున రోగులు వస్తున్నారు. ఆస్పత్రిలో శుభ్రతకు పెద్దపీట వేస్తున్నాం. కొవిడ్ నిబంధనలను పాటిస్తున్నాం.
– డాక్టర్ కోమల్ తారక