టార్గెట్ రూ.30 కోట్లు
రూ.25 కోట్లు వసూలు
మిగతా రూ.5 కోట్ల వసూలుపై దృష్టి సారించిన అధికారులు
సైదాబాద్, మార్చి 19 : జీహెచ్ఎంసీ మలక్పేట సర్కిల్-6 పరిధిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు ఆస్తి పన్నులను వసూలు చేస్తున్నారు. ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియ మొదలయినప్పటీ నుంచి బకాయిల వ సూళ్ల కోసం ప్రత్యేక దృష్టి సారించారు. సర్కిల్ పరిధిలో గతేడాది రూ.30 కోట్లను వసూలు చేయగా, అదేస్థాయిలో రికార్డుస్థాయిలో ఈ ఏడాది కూడా ఆస్తిపన్నుల టార్గెట్ను దృష్టి పెట్టుకుని తమ లక్ష్యాన్ని చేరుకోవటానికి వేగం పెంచారు. ఇప్పటికే రూ. 25 కోట్లు వసూలు కాగా.. మిగతా రూ.5 కోట్ల వసూలుపై అధికారులు దృష్టి సారించారు. మార్చి 31నాటికి తమ టార్గెట్ను చేరుకోవటానికి సర్కిల్ కృషిచేస్తున్నారు.
వసూలుకై సిబ్బంది నియామకం..
సర్కిల్ పరిధిలో ఉన్న ఏడు డివిజన్లలో పన్నులను వసూలు చేయటానికి ప్రత్యేక టీంలను నియమించి వారికి బాధ్యతలు అప్పగించారు. రెసిడిన్షియల్, కమర్షియల్ ఆస్తి పన్నుల వసూలుతో పాటు ట్రేడ్ లైసన్స్లను పునరుద్దరీకరణ పనులను ప్రత్యేక టీంలను కేటాయించారు. ప్రత్యేక సూపర్వైజింగ్ అధికారిగా నియమించి అతని పర్యవేక్షణలో టీం లీడర్లు, బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, ఆఫీస్ సిబ్బంది, ఎస్ఎఫ్ఎ,సూపర్వైజర్ల సేవలను వినియోగించుకుంటున్నారు.
పన్నులు చెల్లించాలని జోరుగా ప్రచారం..
అస్తి పన్నులను చెల్లించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రచారం చేస్తున్నారు. మోండి బకాయిదారులకు రెడ్ నోటీసులు, డైమాండ్ నోటీసులు జారీ చేస్తున్నారు. సకాలంలో పన్నులను చెల్లించే విధంగా కాలనీ సంక్షేమ సంఘాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.