మైలార్‌దేవ్‌పల్లి, మార్చి15: చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని అప్పాచెరువు వద్ద ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న బాక్స్ డ్రైన్ పనులను అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. వర్షాకాలంలో అప్పాచెరువు నిండి ఆ నీరు ప్రధాన రహదారిలో ప్రవహిస్తూ వాహనదారులకు ఇబ్బందులకు గురిచేసింది. రెండేండ్ల కిందట అప్పాచెరువు కట్ట తెగి మృత్యువాత పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వరద నీరు బయటికి వెళ్లడానికి బాక్స్ డ్రైన్, ఓపెన్ నాలా నిర్మాణానికి ప్రభుత్వం రూ. 8.45 కోట్లు నిధులు మంజూరు చేసింది. 5 మీటర్ల వెడల్పుతో 550 మీటర్ల పొడువు నాలా పనులకు శ్రీకారం చుట్టారు. చెరువు స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని స్థానిక నాయకులు సరికొండ వెంకటేశ్ మేయర్‌కు వివరించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ..చెరువు స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటివారైన సహించేదిలేదని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. నాలా పనులు పూర్తి చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆమె వెంట రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్, జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్ , టౌన్ ప్లానింగ్ అధికారి రాణి, జీహెచ్ఎంసీ ఈఈ కిరణ్ , డీఈ కాశీఫ్ ఉస్సేన్, ఏఈ ఫైజల్ పాల్గొన్నారు.