మియాపూర్, మార్చి 15 : శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు పోలీసు శాఖకు ఎంతగానో తోడ్పడుతున్నాయని, ప్రజలు వివేకవంతులై ప్రతి కాలనీలో తప్పక ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. కనురెప్ప వాల్చకుండా ఇరవై నాలుగు గంటల పాటు నిఘాను కలిగి ఉండే వీటితో నేరాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ. 11 లక్షల నిధులతో ఏర్పాటు చేసుకున్న 76 సీసీ కెమెరాలను ఏసీపీ పురుషోత్తం, సైదులు, ఎస్ఐ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణలతో కలిసి విప్ గాంధీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పలు నేరాలలో, రహదారి ప్రమాదాలలో సీసీ కెమెరాల దృశ్యాలు ఎంతో కీలకంగా పోలీసు శాఖకు ఉపయోగపడ్డాయన్నారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటంలో ప్రజలను చైతన్య పరచటంలో పోలీసుల పాత్ర అభినందనీయమన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు తన సీడీపీ నిధుల నుంచి రూ. 3 కోట్ల కేటాయించినట్లు పేర్కొన్నారు.
ప్రతీ కాలనీలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని వాటి పనితీరును గమనించుకోవాలని గాంధీ సూచించారు. ప్లాస్టిక్ నిశేధంతో పాటు కాలనీలో పచ్చదనాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, చంద్రారెడ్డి, భగవంత్‌రెడ్డి, నర్సింహులు, అనంతరాములు, ధర్మారావు, రాజేశ్వర్, కన్నారావు, రామకృష్ణ, కనకారెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.