సికింద్రాబాద్/బొల్లారం, మార్చి 14: కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల మూసివేతలు, అభివృద్ధి పనులను అడ్డుకుంటూ ప్రజల్ని తిప్పలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం.. అంతటితో ఆగడం లేదు. ఇక్కడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న మంత్రుల మాటల్ని సైతం వక్రీకరించి విషం కక్కుతున్నది. రోడ్ల మూసివేత వల్ల పడుతున్న ఇబ్బందులను కండ్లకు కట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చూపించినా.. స్పందన మాత్రం లేదు. ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు భూములివ్వాలని కోరినా పట్టింపే లేదు. కార్వాన్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నాలాలపై చెక్ డ్యామ్‌లు నిర్మిస్తుండటంతో నాలా ఉధృతి కారణంగా పక్కనే ఉన్న నదీం కాలనీ పూర్తిగా జలమయమవుతున్నది. మరోవైపు గోల్కోండ సమీపంలోని శాతం చెరువు నీటి మళ్లింపుకు సంబంధించి ఆర్కాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి నీటిని వదులుదామంటే అనుమతి ఇవ్వకుండా చోద్యం చూస్తున్నది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కేంద్రంలోని డిఫెన్స్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి దానికి అడ్డుపడుతున్న కంటోన్మెంట్ అధికారులు, కేంద్రం దిగొచ్చేలా చర్యలు తీసుకుంటే తప్ప వీరికి చలనం రాదని వ్యాఖ్యానించారు. దీంతో మిలటరీ అథారిటీ ప్రాంతంలో నీటిని, విద్యుత్ సరఫరాను ప్రజాహితం కోసం తప్పకుండా నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కానీ దానికి కమలం నేతలు వక్రభాష్యం చెబుతూ పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. లోకల్ మిలటరీ అథారిటీ అధికారుల తీరుపై ఒక్క మాటా మాట్లాడని బీజేపీ నేతలు.. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
అభివృద్ధికి మోకాలడ్డు…
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కొత్త రోడ్లు వేయాలని, నాలాలు నిర్మించాలని, పేదలకు పట్టాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కేంద్రం మాత్రం మోకాలడ్డుతున్నది. ఓ వైపు రోడ్లు మూసివేయడంతో పాటు, పేదలకు పట్టాలు కూడా ఇవ్వకుండా అడ్డుపడుతోంది. రోడ్ల విస్తరణ, స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ స్థలం ఇవ్వకుండా అసౌకర్యం కలిగిస్తోంది. డిఫెన్స్ భూములకు ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామన్నా కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు.
కొవ్వొత్తుల ర్యాలీలు.. సంతకాల సేకరణ
కంటోన్మెంట్లో రోడ్ల మూసివేతకు వ్యతిరేకంగా సోమవారం స్థానికులు రామకృష్ణాపురం బ్రిడ్జి వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ నార్త్ ఈస్టన్ కాలనీ సెక్రటరీ సీఎస్ చంద్రశేఖర్ నేతృత్వంలో స్థానికులు రోడ్ల మూసివేతపై గళమెత్తారు. మరోవైపు తిరుమలగిరి చౌరస్తాలో కంటోన్మెంట్ ఏడో వార్డు మాజీ సభ్యుడు శ్యాంకుమార్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. మూసివేసిన రోడ్లను వెంటనే తెరువాలని చాలా బస్తీల ప్రజలు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్ కుమార్, విశ్వనాథ్, రాజారెడ్డి, ఉమేష్, విజయ్, గోపి, దుర్గా ప్రసాద్, నంద కుమార్, రాజు సాగర్, మధు, వెంకటేష్, రాము, పర్వేష్ఖాన్, వీరమణి, రజిని తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి టీఆర్ఎస్ నిరసనలు..
కంటోన్మెంట్ రోడ్ల మూసివేత, అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు ఓట్ల తొలగింపుపై టీఆర్ఎస్ పార్టీ అందోళనలకు సిద్ధమైంది. మంగళవారం తిరుమలగిరిలోని డంపింగ్ యార్డు తరలింపు విషయంలో బోర్డు అధికారుల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టనున్నారు. ఓట్ల తొలగింపుపై బుధవారం ఆందోళనలకు సమాయత్తమయ్యారు.
కేంద్రం తీరును ఎండగడుతాం
కంటోన్మెంట్ ప్రాంతంపై కేంద్రం చిన్నచూపును ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. లోకల్ మిలటరీ అథారిటీ నిబంధనలకు విరుద్ధంగా తరచూ రోడ్లను మూసి వేస్తోంది. సికింద్రాబాద్ పరిధిలో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోకల్ అథారిటీ తన పరిధిలో ఉన్న అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్డు, వెల్లింగ్టన్ రోడ్డు, ఆర్డినెన్స్ రోడ్డులను పదేపదే మూసివేస్తున్నది. బోర్డు అనుమతి లేకుండా ఈ రహదారులను మూసి వేయవద్దని ఇచ్చిన ఆదేశాలను సైతం లోకల్ మిలటరీ అథారిటీ పట్టించుకోవడం లేదు. కేంద్రంపై పోరాడేందుకు సిద్ధమయ్యాం.
– మర్రి రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి
అన్నీ అబద్ధాలే
కంటోన్మెంట్ రహదారుల మూసివేతపై అన్నీ అసత్యాలే మాట్లాడుతున్నారు. 21 రోడ్లు మూసివేసినా కేవలం 7 రోడ్లు మాత్రమే మూసివేశామని అబద్ధాలు చెప్పడం మంచిది కాదు. 2014 నుంచి ఈ రోడ్ల మూసివేతపై ఆందోళనలు చేస్తూనే ఉన్నాం. ప్రత్యామ్నాయ మార్గాలను చూపకుండానే మూసివేయడంతో కిలోమీటరు దూరానికి 9 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. కేంద్రం ప్రభుత్వం ఇప్పటికైనా లోకల్ అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి రోడ్లను మూసివేయకుండా చర్యలు తీసుకోవాలి.
– సీఎస్. చంద్రశేఖర్, సెక్రటరీ, ఫెడరేషన్ ఆఫ్ నార్త్ ఈస్ట్ కాలనీ(గ్రీన్ సైనిక్‌పురి)