సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 13(నమస్తే తెలంగాణ): రిమ్.. జిమ్.. రిమ్.. జిమ్.. హైదరాబాద్! రిక్షావాలా.. జిందాబాద్!! ఇదీ ఒకప్పుడు హైదరాబాద్ నగరమనగానే గుర్తొచ్చే పాట. దశాబ్దాల కిందట నగర ప్రజా రవాణా వ్యవస్థ అంటేనే రిక్షా. అనంతరం కాల గమనంలో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ అనేక పుంతలు తొక్కింది. వేగంగా పట్టణీకరణ.. పెరుగుతున్న జనాభా.. విస్తరిస్తున్న మహానగరం.. ఇందుకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థ రోడ్డు మీద నుంచి పట్టాలెక్కి.. ఆపై ఎలివేటెడ్ రూపంలో ఆకాశానికేగింది. విశ్వనగరంగా దూసుకుపోతున్న ఈ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థ కూడా అదే తరహాలో ఉండాలనేది తెలంగాణ సర్కారు యోచన. అందుకే ముందుచూపుతో అడ్వాన్స్డ్ విధానంలో తాజాగా ఈబీఆర్టీఎస్ (ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం)ను తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అంతేకాదు.. హైదరాబాద్ నగరమంటే గుర్తుకొచ్చే డబుల్ డెక్కర్ బస్సును కూడా అందుబాటులోకి తెచ్చేందుకు నిధులు కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో నగర ప్రజా రవాణా వ్యవస్థ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే…
హైదరాబాద్‌లో చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యాధునిక ప్రజా రవాణా సాధనం. అలాంటి ప్రాజెక్టు తరహాలోనే మరింత అత్యాధునిక, తక్కువ వ్యయంతో పాటు పరిమిత విస్తీర్ణంలో మరో ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నగరంలో చేపట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన ప్రజారవాణా వ్యవస్థలు ట్రాఫిక్ కష్టాలను తీర్చే ప్రత్యామ్నాయాలుగానే ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యాధునిక రవాణా సాధనంగా ఉన్న ఈబీఆర్టీఎస్ను (ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టం) అడ్వాన్స్డ్ విధానంలో తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు రూ.2500 కోట్లతో ప్రాజెక్టును చేపడుతున్నట్లు శాసనసభ వేదికగా మంత్రి కేటీఆర్ రెండు రోజుల కిందట ప్రకటించారు. బస్సుల మాదిరిగానే ఉండే రైలు బోగీలు రోడ్డు మీద కాకుండా ఆకాశ మార్గం (ఫ్లై ఓవర్)లో పరుగులు పెట్టేలా ప్రత్యేకంగా పిల్లర్లను నిర్మిస్తూ వాటికి అనుసంధానంగా ట్రాక్‌ను నిర్మించనున్నారు. ఈ ట్రాక్‌కు విద్యుత్ సరఫరా అనుసంధానమై ఉంటుంది. మెట్రో స్టేషన్ మాదిరిగా ఎక్కువ స్థలం అవసరం లేకుండా అతి తక్కువ స్థలంలోనే ప్రయాణికులు వాటిని ఎక్కి, దిగేందుకు వీలుగా నిర్మాణాలు చేపడుతారు. ఇప్పటి వరకు దేశంలోనే లేనటువంటి అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థను నగరంలో తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ మార్గాన్ని నగరానికి వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న ఐటీ కారిడార్‌ను పూర్తి స్థాయిలో అనుసంధానం చేసేలా కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదుగా కోకాపేట నియోపోలీస్ వరకు 22 కిలోమీటర్ల మేర ఈబీఆర్టీఎస్కు రూపకల్పన చేస్తున్నారు.
ఆటోలదీ ఒక ట్రెండు..
నగరంలో తక్కువ సమయంలో గమ్యం చేరాలనుకునే వారు ఆటోలను ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో నగర ప్రజా రవాణాలో క్రమేణా ఆటోలదీ కీలక పాత్రగా మారింది. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో 1.10 లక్షల వరకు ఆటోలు ఉండగా, అనధికారికంగా వీటి సంఖ్య ఇంతకంటే ఎక్కువే. ఒకవైపు ప్రజల రవాణాకు ఇది దోహదపడుతుండగా… లక్షలాది మందికి ఇది జీవనోపాధిగా కూడా మారింది.
మూడు చక్రాలు గిరగిరా…
హైదరాబాద్ నగర చరిత్రలో మూడు చక్రాల ప్రజా రవాణా వ్యవస్థ అనేది వెన్నెముకలా ఉండేది. చాలాకాలం ప్రజలు నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు గుర్రపు బగ్గీలను వినియోగించేవారు. ఆపై ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారిన తర్వాత రిక్షాల యుగం వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్ ప్రజా రవాణాను రిక్షా ఆక్రమించింది.
సిటీ ఐకాన్‌గా డబుల్ డెక్కర్…
గుర్రపు బగ్గీలు, రిక్షాల తర్వాత ప్రజా రవాణాలోకి ఆర్టీసీ బస్సులు వచ్చి చేరాయి. ఈ క్రమంలోనే వచ్చిన డబుల్ డెక్కర్ బస్సు అనేది నగర ఐకాన్‌గా మారింది. హైదరాబాద్‌కు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు కచ్చితంగా డబుల్ డెక్కర్ ప్రయాణం చేయనిదే నగరాన్ని వీడేవారు కాదు. కాలక్రమేణా డబుల్ డెక్కర్ కనుమరుగైనా… నేటికీ ఆ బస్సు అంటే అదో అనుభూతి. అందుకే హైదరాబాద్ చారిత్రక తీపి గురుతులను తిరిగి వాస్తవికంలోకి తెచ్చేందుకుగాను తెలంగాణ ప్రభుత్వం డబుల్ డెక్కర్ బస్సును రోడ్లపైకి తెచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ చొరవతో ఆర్టీసీ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తుండగా… డబుల్ డెక్కర్ బస్సును నగర రోడ్లపైకి తెచ్చేందుకుగాను హెచ్ఎండీఏ ద్వారా రూ.10 కోట్ల నిధులు ఆర్టీసీకి ఇవ్వనున్నట్లు రెండు రోజుల కిందట మంత్రి కేటీఆర్ శాసనసభలో ప్రకటించారు. ఆపై నగరంలో అత్యంత కీలక ప్రజా రవాణా వ్యవస్థగా మారిన గ్రేటర్ ఆర్టీసీలో జేఎన్ఎన్యూఆర్ఎం, ఏసీ బస్సులు ఇలా అనేక రకాలు వచ్చాయి. రోజుకు ఏకంగా 30 లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరవేసే వ్యవస్థగా నగర ఆర్టీసీ బస్సులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
పట్టాలెక్కిన ప్రజా రవాణా…
నగరంలో రోడ్లపై బస్సులు, ఆటోలు వచ్చిన తర్వాత ట్రాఫిక్ అంచనాలకు మించి పెరిగిపోయింది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ ప్రత్యామ్నాయాలను వెతికింది. ఈ క్రమంలోనే రోడ్లపై నుంచి పట్టాలెక్కింది. సామాన్యుడి రవాణా వ్యవస్థలోకి ఎంఎంటీఎస్ (మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం) రైళ్లు వచ్చి చేరాయి. అయితే నగర ప్రజా రవాణా వ్యవస్థలో సామాన్యుడు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ప్రయాణించే సాధనంగా ఎంఎంటీఎస్ మారింది. దీంతో ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి, హైదరాబాద్-ఫలక్‌నుమా… ఇలా మూడు మార్గాల్లో రోజుకు మూడు లక్షల మందికిపైగా ఎంఎంటీఎస్‌ను ఆశ్రయిస్తున్నారు.
విశ్వ నగరంగా…
నగర రవాణా వ్యవస్థలో రోడ్డు, పట్టాలు కాకుండా ఆకాశమార్గంలో (ఎలివేటెడ్)కి ప్రజా రవాణా వచ్చింది… 2017, నవంబర్ 29. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైదరాబాద్ మెట్రో రైలుతో హైదరాబాద్ మహానగరం విశ్వనగర జాబితాలోకి చేరింది. దేశంలోనే రెండో అతి పెద్ద మెట్రో ప్రాజెక్టుగా కీర్తి గడించిన హెచ్ఎంఆర్ ప్రజా రవాణాలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నది. మూడు మార్గాల్లో సుమారు 69 కిలోమీటర్ల మేర అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలులో రోజుకు దాదాపు నాలుగు లక్షల మంది ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.