అమీర్‌పేట్, మార్చి 13: దాసారం బస్తీ నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హామీ ఇచ్చారు. బస్తీలో సమస్యలు తెలుసుకునేందుకు సనత్‌నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి, జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం బస్తీలో పర్యటించారు.ఈ సందర్భంగా బస్తీవాసులు తమ సమస్యలను మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్, విద్యుత్ మీటర్లు కావాలని బస్తీవాసులు చేసిన విజ్ఞప్తికి మంత్రి తక్షణమే స్పందించి అక్కడే ఉన్న విద్యుత్ అదికారులను విద్యుత్ మీటర్లను మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటి నల్లా కనెక్షనక్ల అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఇక్కడి పరిసరాలతో పాటు స్థానికుల శుభ్రత అంశంపై మంత్రి స్పష్టమైన సూచనలు చేశారు. ఇక్కడి పరిసరాలు శుభ్రమైన తరువాత ఇక్కడే మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు నిర్మించి ఇస్తానని తెలిపారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తమ పిల్లల కోసం సాయంత్రం సమయాల్లో ఉచిత ట్యూషన్లు నిర్వహిస్తున్నారని, వీధిదీపాల కింద కొనసాగుతున్న ఈ ట్యూషన్ల కోసం ఓ షెడ్డు నిర్మించి ఇవ్వాలంటూ బస్తీ మహిళలు మంత్రి తలసానికి విజ్ఞప్తి చేశారు.ఇందుకు స్పందించిన మంత్రి బస్తీ పిల్లలకు సాయంత్రం సమయాల్లో పోలీసులు ట్యూషన్లు చెబుతుండడం చాలా మంచి విషయమన్నారు. ఇక్కడ షెడ్డును కచ్చితంగా నిర్మిస్తామని, దీంతో పాటు ఫర్నిచర్, విద్యార్థులకు డ్రెస్ కోడ్ ఉండేలా యూనిఫామ్‌లు కూడా అందేలా చూస్తానంటూ ఇచ్చిన హామీకి బస్తీ మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.