సిటీబ్యూరో, ఫిబ్రవరి 27( నమస్తే తెలంగాణ):“ఆరోగ్యంగా ఉందాం.. పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం..సైక్లిస్టులను ప్రోత్సహిద్దాం.. రోడ్డు నిబంధనలు పాటిద్దాం..డ్రగ్స్భూతాన్ని చిదిమేద్దాం.. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి..” ఇలాంటి సామాజిక సందేశాలతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సైక్లిస్టులు ఆదివారం నగరంలో పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ చేపట్టారు. గచ్చిబౌలీ స్టేడియం నుంచి కేబీఆర్ పార్క్ మీదుగా నెక్లెస్ రోడ్డు చేరుకుని.. అక్కడి నుంచి చార్మినార్ వరకు 375 మంది సైక్లింగ్ రైడ్ చేశారు. హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ పేరుతో హ్యాపీ హైదరాబాద్, హైదరాబాద్సైక్లిస్టు గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సైక్లింగ్ రైడ్ నగర పోలీసుల సాయంతో విజయవంతంగా ముగిసింది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు వారి వెంట ఉండి గ్రీన్ సిగ్నల్స్‌తో డెస్టినేషన్ చేర్చి ఆదర్శంగా నిలిచారు. సైక్లిస్టుల వెంట మూడు అంబులెన్స్‌లు వచ్చాయి. తమకు సహకరించిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు సైక్లిస్టులు కృతజతలుతెలిపారు. ఈ సందర్భంగా పలువురు సైక్లిస్టులు నమస్తే తెలంగాణతో సైక్లింగ్ ప్రాధాన్యతను పెంచాల్సిన ఆవశ్యకతను పంచుకున్నారు.
సైక్లిస్టులకు సహకరించాలి
నగరంలో సైక్లింగ్ చేయడానికి ప్రత్యేకమైన దారి ఏర్పాటు చేస్తే సైక్లిస్టుల సంఖ్య మరింత పెరగుతుంది. వాహనాలు వదిలి సైకిల్స్‌ను ఆశ్రయిస్తారు. ప్రభుత్వానికి మేం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లాలని అనుకుంటున్నాం. కార్యాలయాలకు కూడా మేం సైకిల్‌పైనే వెళుతున్నాం. ప్రతి ఒక్కరూ సైక్లింగ్‌లో కలిసిరావాలి. సైక్లిస్టులు రోడ్డు గుండా వెళుతున్న సమయంలో వాహనదారుల వారికి సహకరించాలి. ర్యాష్ డ్రైవింగ్ మంచిది కాదు.
– ఫణిశ్రీ, సైక్లిస్టు
సైక్లింగ్ ట్రాక్ కావాలి
సైక్లింగ్ ట్రాక్ నగరంలో ఏర్పాటు చెయాల్సిన అవసరం ఉందని మా అభిప్రాయం. గచ్చిబౌలి నుంచి చార్మినార్.. ఇలా ఇతర ప్రాంతాల అన్నింటిని కనెక్ట్ చేసి ఓ రోడ్డు మ్యాప్‌ను రూపొందించి ట్రాక్స్ ఏర్పాటు చేస్తే సైక్లిస్టులు అంతా ఆ దారి వెంట వెళ్లిపోతారు. ట్రాఫిక్ సమస్య ఉండదు. చాలా మంది సైక్లింగ్ చేయడానికి ముందుకొస్తారు. వాటితో పాటు బైస్కిల్ షేరింగ్ ప్రాజెక్ట్ చేపట్టి మెట్రో, బస్టాప్స్ల సమీపంలో సైక్లింగ్ సేవలు అందించడం వల్ల ఆ సమీపంలోని కార్యాలయాలకు వెళ్లేవారు వాహనాలను ఆశ్రయించకుండా సైకిల్‌ను తీసుకొని వెళతారు.
చెట్టు విలువ తెలుసుకో
కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆక్సిజన్ దొరకకపోతే ప్రాణాలు నిలబెట్టుకోలేం. చెట్లను పెంచడం, వాటి నరికివేతను ఆపడం, అడవుల కొట్టివేతను అరికట్టడం వల్ల గాలిలో సహజంగా ఆక్సిజన్ లభిస్తుంది. ఒక చెట్టు వయసును బట్టి ఒక ఏడాదికి దాని విలువ 74,500 అని సుప్రీం కోర్టు నియమించిన ఐదుగురు సభ్యుల ప్యానెల్ తమ నివేదికలో తెలిపింది. ఒక వంద సంవత్సరాల చెట్టు విలువ ఒక కోటి రూపాయలు కంటే ఎక్కువ ఉంటుంది. మానవ శరీరంలాగే చెట్టు విలువ చాలా విలువైనది. చెట్టును నరకడం అంటే దానిని చంపడమే. సైక్లింగ్ వినియోగం పెంచి మనవంతుగా పర్యావరణాన్ని రక్షించుకుందాం.
– రుతుంబర, సైక్లిస్టు
హైదరాబాద్‌లోనే అనువైన వాతావరణం
పర్యావరణ పరిరక్షణకు అండగా నిలుస్తున్న ప్రతీ కార్యక్రమానికి మేం మా వంతు బాధ్యతను నిర్వర్తిస్తాం. కాలుష్యం తగ్గించడానికి వాహనాల వినియోగం తగ్గించాలి. సైక్లింగ్ వినియోగం పెరగాల్సిన అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా మేం అనేక సైక్లింగ్ రైడ్లు చేపట్టాం. కాశ్మీర్ టూ కన్యాకుమారి వరకు చుట్టొచ్చాం. సైక్లింగ్‌కు అనువైన వాతావరణం హైదరాబాద్‌లోనే ఉంది. సైక్లింగ్ వినియోగం పెంచడమే మా ప్రధాన లక్ష్యం. సైక్లింగ్‌తో ఆరోగ్యంగా ఉంటాం. పర్యావరణ పరిరక్షణలో సైక్లింగ్ కీలకమని చాటిచెప్పడానికే ఈ సైకిల్ ర్యాలీ చేపట్టాం.
– వి. రవీందర్, ప్రెసిడెంట్, హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్
పోలీసులకు హ్యాట్సాఫ్
గచ్చిబౌలి టూ చార్మినార్ వరకు జరిగిన సైకిల్ ర్యాలీ విజయవంతమవడంలో నగర పోలీసులు కృషి అభినందనీయం. వారు మా సైక్లింగ్ యాత్రకు ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా సాఫీగా సాగేలా భద్రత కల్పించారు. చాలా సంతోషంగా అనిపించింది. సైక్లింగ్ వినియోగం పెంచాలనే మా ఉద్దేశానికి అందరి మద్దతు లభిస్తుంది. పోలీసులు చేపట్టే ప్రతీ అవగాహన కార్యక్రమంలో మా సైక్లిస్టుల తరపున పాల్గొని ప్రచారం చేస్తాం. ఇప్పటికే డ్రగ్స్ రూపుమాపే ప్రచారంలో పాల్గొన్నాం.
– రవి సాంబరి, సైక్లిస్టు
హరితహారం మాకు స్ఫూర్తి
కాలుష్యంతో ప్రాణికోటికి పెనుముప్పు పొంచి ఉంది. కొవిడ్ కన్నా కాలుష్యంతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని సాక్షాత్ ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక హెచ్చరించింది. ఏటా 90 లక్షల మంది చనిపోతున్నారని నివేదిక సూచించింది. తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం చాలా విలువైనది. మేం కూడా మా విధిగా మొక్కలు నాటుతున్నాం. సైక్లింగ్‌తో నగరవాసుల్లో అవగాహన కల్పిస్తున్నాం.
– అంజని, హైదరాబాద్ సైక్లిస్టు
దేశంలో 15 అత్యధిక కాలుష్య ప్రాంతాలు
వాతావరణంలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాలు బద్దలవడం, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల మానవాళిపై పెను ప్రభావం పడుతోంది. ఏటా కాలుష్యం వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న 100సిటీలో 15 ఇండియాలోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. ఈ రకంగా మనం పర్యావరణాన్పి కాపాడుకోకపోతే పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సైక్లింగ్ వినియోగం పెరగాల్సిన అవసరం ఉంది.
– లక్ష్మీశ్రీ, సైక్లిస్టు