హైదరాబాద్ ఆట ప్రతినిధి, ఫిబ్రవరి 27 : తెలంగాణ క్రీడాకారులను ఒలంపిక్స్ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఒలంపిక్స్, కయాకింగ్ అండ్ కానోయింగ్ అసోసియేషన్ల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. ఆదివారం హుస్సేన్‌సాగర్ తీరంలోని వాటర్‌స్పోర్ట్స్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కయాకింగ్ అండ్ కానోయింగ్ సెలెక్షన్ ట్రాయిల్స్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఒలంపిక్స్‌లో 14స్వర్ణ పతకాలు ఉన్న వాటర్ స్పోర్ట్స్ క్రీడలో పతకాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ఎం.రామకృష్ణ, కోశాధికారి కె.మహేశ్వర్ సాగర్, సాట్స్ పరిశీలకుడు, కోచ్ రామకృష్ణ, ప్రతినిధులు అస్లం, నీతేశ్వరి, ఎల్.అనిల్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం జరిగిన 500మీటర్ల రేసులో అజయ్ చాహల్, యోగేశ్, సచిన్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో అంకిత్, అమన్, అమర్జిత్ బిశ్వర్ అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు.
జింఖానా మైదానంలో..
యువత సెల్ ఫోన్లు, చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండాలంటే క్రీడల వైపు మొగ్గు చూపే విధంగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని టీఓఏ కోశాధికారి కె.మహేశ్వర్ సాగర్ అన్నారు. ఆదివారం జింఖానా మైదానంలో తెలంగాణ రగ్భీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ జిల్లాల జూనియర్ రగ్భీ చాంపియన్‌షిప్‌ను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్ జట్టు 8-3 గోల్స్ తేడాతో నల్గొండ జిల్లా జట్టుపై విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రగ్భీ అసోసియేషన్ కార్యదర్శి పి.రాము, రంగారెడ్డి కార్యదర్శి ఎం.ప్రవీణ్ కుమార్, ఆధిత్య, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ చాంప్కు హైదరాబాద్ జట్టు
అంతర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే హైదరాబాద్ జిల్లా జట్టును ఆదివారం ఎల్బీ స్టేడియంలోని పవర్ లిఫ్టింగ్ హాల్లో అసోసియేషన్ అధ్యక్షుడు ఎంజీ.సునీల్ కుమార్, కార్యదర్శి జోసెఫ్ జేమ్స్ ప్రకటించారు.
మహిళల జట్టు .. సి.హేమలత, సుమరియా, భాగ్యలక్ష్మి, ఆర్తిక్, ఎస్.ప్రవళిక, సీహెచ్.అఖిల, శ్రీపూజిత, ఈ.సరిత ఉన్నారు.
పురుషుల జట్టు..కె.సందీప్, ఎం.ముఖేశ్‌కుమార్, ఆర్.రాజేశ్, కె.పవన్ కుమార్, వి.మహేందర్, ఎం.జస్వీర్ ఉన్నారు.