మీరు చేసే వేస్ట్.. ఎంతో మందికి బెస్ట్‌గా మారుతుంది. మీరు వద్దనుకుంటే వదిలేయండి. ఇంటి వద్దకే వస్తాం.. మేమే సేకరిస్తాం.. కానీ రోడ్ల వెంట, నాలాల్లో, ఇండ్ల మధ్యన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పడేయకండి.. అంటూ జీహెచ్ఎంసీ కల్పిస్తున్న అవగాహన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఇండ్లలోని పనికిరాని వస్తుల సేకరణ కోసం జీహెచ్ఎంసీ చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌కు మొదటి రోజు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇంటికే వచ్చి ఆయా వస్తువులను బల్దియా సేకరిస్తుండటంతో తమ ఇండ్లలో ఉన్న నిరుపయోగ వస్తువులను పెద్ద ఎత్తున అందజేస్తున్నారు. మొదటి రోజు కూకట్పల్లి సర్కిల్ పరిధిలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో 25 టన్నులకు పైగా పనికిరాని వస్తువులను సేకరించారు. అయితే తమ ఇండ్లలో ఉన్న నిరుపయోగ వస్తువులను ఎక్కడ వేయాలో తెలియక, ఇంట్లో ఉంచుకోలేక ఇబ్బందులు పడుతున్న నగర వాసులు ఈ కార్యక్రమానికి జై కొడుతున్నారు.
కూకట్పల్లి సర్కిల్ పరిధిలో ఎంపిక చేసిన కాలనీల్లో చేపట్టిన ‘అవసరం లేని వస్తువుల సేకరణ’ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని ఉప కమిషనర్ పి.రవీందర్‌కుమార్ అన్నారు. ఆదివారం సర్కిల్ పరిధిలోని ఆరు వార్డుల్లోని ఆరు కాలనీల్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌ను డీసీ రవీందర్‌కుమార్, ఏఎంహెచ్‌వో చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలు బస్తీల్లో నివసిస్తున్న ప్రజలు ఇంట్లోని నిరుపయోగ వస్తువులను నాలాలు, ఖాళీ ప్రదేశాల్లో వేయడం జరుగుతుందన్నారు. తద్వారా పరిసరాలు అపరిశుభ్రంగా మారడం, కాలువల్లో వేయడం వల్ల వర్షంనీటి ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడి ముంపు సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.
కొందరు నిర్లక్ష్యంతో.. మరికొందరు బాధ్యతా రహితంగా చేస్తున్న పనుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం దిశగా సర్కిల్ పరిధిలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో మొదటి రోజు 25 టన్నులకు పైగా పనికిరాని వస్తువులను సేకరించినట్లు తెలిపారు. వీటిలో పనికిరాని బట్టలు, సోఫాలు, కీ బోర్డులు, పాతబకెట్లు, చెప్పులు, మంచా లు, దివాన్‌సెట్లు ఉన్నట్లు చెప్పారు. సేకరించిన వాటిలో కొన్ని వస్తువులను తిరిగి ఉపయోగించుకునే వీలుండటంతో వాటిని సర్కిల్ పరిధిలోని గుడ్‌విల్ స్టోర్ ద్వారా తిరిగి పేద ప్రజలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. పనికిరాని వస్తువులను డంపింగ్ యార్డుకు తరలించినట్లు తెలిపారు. ఇదే తరహాలో ప్రతీ ఆదివారం స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టడం జరుగుతుందన్నా రు. ఎంపిక చేసిన కాలనీల్లో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఆయా కాలనీల ప్రతినిధులు, ఎస్ఎఫ్ఏలు పాల్గొన్నారు.
ప్రధానంగాసేకరించిన వస్తువులు
బట్టలు, సోఫాలు, కీబోర్డులు, పాతబకెట్లు, చెప్పులు, మంచాలు, దివాన్‌సెట్లు, తదితర
వీటిలో కొన్ని తిరిగి ఉపయోగంలోకి తెచ్చే అవకాశం ఉండగా.. మిగతావి డంపింగ్ యార్డుకు తరలించారు.