సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో పారిశుధ్య సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ పకడ్బందీగా చర్యలు చేపడుతున్నది. ఒకే చోట చెత్త గుట్టలుగా పేరుకుపోకుండా ఉండేందుకుగాను ఎక్కడికక్కడ ఎస్సీటీపీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశాలు మేరకు ప్రతి సర్కిల్‌కు మూడు చొప్పున 30 సర్కిళ్లలో 90 సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్లను (ఎస్‌సీటీపీ) ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో ఇప్పటికే 24 కేంద్రాలు అందుబాటులోకి రాగా, తాజాగా కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్టలో రెండు స్టాటిక్ స్టేషన్లు, 10 స్టాటిక్ కంటైనర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా జోనల్ అధికారుల పనితీరును అభినందించారు.