సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): వివిధ రకాల లైసెన్స్‌లు, ప్రజలకు అవసరమైన పలు సేవలు ఆన్లైన్ నుంచే పొందే విధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. కొత్త ఫీచర్లతో తయారైన వెబ్సైట్ (WWW.HYDERABADPOLICE.GOV. IN) ను మంగళవారం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నగరానికి చెందిన పలువురు వ్యాపారులు, పోలీసు అధికారుల సమక్షంలో సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రీ డిజైన్ చేసిన సిటీ పోలీస్ వెబ్సైట్ ద్వారా ప్రభుత్వం ఈఓడీబీ(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) నిబంధనలకు అనుగుణంగా జవాబుదారితనం, పారదర్శకతతో వేగంగా ఆన్లైన్లో సేవలు అందుతాయని, ఈ సేవలు రాష్ట్రంలో మొదటి సారిగా ప్రారంభించిన యూనిట్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అని అన్నారు. ఆన్లైన్లో దరఖాస్తును పూర్తి చేయడానికి 15 నిమిషాలు పడుతుందని, కొత్త లైసెన్స్‌కు 30 రోజులు, రెన్యూవల్స్‌కు 15 రోజుల్లో జారీ అవుతాయన్నారు. దరఖాస్తులను పరిశీలించి 15 రోజుల్లో ఎస్హెచ్ఓలు, ఏసీపీలు రెండు రోజుల్లో, డీసీపీలు మూడు రోజుల్లో, సీపీ కార్యాలయంలో 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి లైసెన్స్‌లు జారీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి 450 మంది వ్యాపారులు హాజరు కాగా, ఆయా ఎస్హెచ్ఓలు ఆన్లైన్ ద్వారా సీపీ కార్యాలయానికి కనెక్ట్ అయ్యారు. ఈ సమావేశంలో అదనపు సీపీ విక్రమ్‌సింగ్ మాన్,ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీ ఎం. రమేశ్, డీసీపీలు జోయెల్ డేవీస్, చందనా దీప్తి, డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.