సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ);అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్‌లో త్వరలోనే మరో రెండు ఫ్లైఓవర్లు అందుబాటులోకి రానున్నాయి. మెరుగైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు బల్దియా ఎస్ఆర్డీపీ కింద నగరానికి నలువైపులా ఆర్వోబీలు, అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తూ.. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపుతున్నది. ఇందులో భాగంగానే నిర్మాణం పూర్తయిన శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్‌ను ఈ వారంలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. మరో కీలకమైన కొత్తగూడ వంతెన కూడా వచ్చే నెలాఖరులో అందుబాటులోకి తెచ్చేందుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ రెండు ఫ్లెఓవర్లు వాడుకలోకి వస్తే.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్‌సిటీ ప్రాంతాల మధ్య ప్రధాన కనెక్టివిటీ ఏర్పడుతుంది.
నగర వాసులకు తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు ప్రారంభానికి ముస్తాబైన శిల్పా లేఅవుట్ వంతెన వచ్చే నెలాఖరులో కొత్తగూడ ఫ్లై ఓవర్ అందుబాటులోకి హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు పూర్తి మౌలిక వసతులు కల్పించేందుకు జీహెచ్ఎంసీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు, సిగ్నల్ రహిత, మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి జీహెచ్ఎంసీ నగరం నలువైపులా ఫె్లై ఓవర్లు, ఆర్ఓబీలు, అండర్ పాస్‌లు నిర్మించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తున్నది. ఇందులో భాగంగానే ఈ వారంలో శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా..కీలకమైన కొత్తగూడ ఫ్లై ఓవర్ వచ్చే నెలాఖరులో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 95శాతం మేర పనులు పూర్తి చేసుకున్న కొత్త గూడ ఫ్లై ఓవర్‌కు అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు.
ప్రాజెక్టు ప్రయోజనాలు..
బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్లకు ఇరువైపులా భారీ కమర్షియల్ భవనాలు ఉన్నాయి. పరిసర ప్రాంతాలలో అనేక సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్నాయి. ఈ జంక్షన్లలో రద్దీ సమయాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్నది. ఈ ఫ్లై ఓవర్ రాకతో బొటానికల్ గార్డెన్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
ఈ వారంలోనే 17వ ఫ్లై ఓవర్ ప్రారంభం
శిల్పా లేఅవుట్ ప్రారంభానికి ముస్తాబైంది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ వారంలోనే దీనిని అందుబాటులోకి తీసుకువచ్చేలా జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓఆర్ఆర్ నుంచి గతంలో ఉన్న గచ్చిబౌలి ఫె్లైఓవర్ పై నుంచి శిల్పా లే ఔట్ వరకు.. అకడ నుంచి ఓఆర్ఆర్ వరకు మరో వైపు రెండు వైపులా కలుపుకుని మొత్తం 956 మీటర్ల పొడవు 16.60 మీటర్ల వెడల్పు గల ఫె్లై ఓవర్ చేపట్టారు. అప్ ర్యాంపు ఓఆర్ఆర్ నుంచి శిల్పా లే అవుట్ ఫె్లైఓవర్ వరకు 456.64 మీటర్ల వెడల్పు, శిల్పా లే అవుట్ నుంచి ఓఆర్ఆర్ వరకు డౌన్ ర్యాంపు ఫె్లై ఓవర్ 399.952 మీటర్ల వెడల్పుతో రెండు ఫె్లైఓవర్లను చేపట్టారు.
సర్వీస్ రోడ్డుగా ఉపయోగించబడే గచ్చిబౌలి నుంచి మైండ్ స్పేస్ వరకు 473 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో అప్ ర్యాంపు ఫె్లైఓవర్ను చేపట్టారు. అదే విధంగా మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలి వరకు డౌన్ ర్యాంపు ఫె్లై ఓవర్ 522 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో చేపట్టారు. ఈ శిల్పా లే అవుట్ ఫె్లై ఓవర్‌తో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. గచ్చిబౌలి జంక్షన్ ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. హెచ్‌కెసి, మీనాక్షి టవర్ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది.