మియాపూర్, నవంబర్ 11 : రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న శేరిలింగంపల్లిని ‘వ్యూహాత్మక’ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వందలాది ఐటీ కంపెనీలు.. లక్షలాది ఉద్యోగుల రాకపోకలు ప్రపంచ స్థాయి ప్రాముఖ్యత కలిగిన సంస్థలతో ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్ల నిర్మాణాలను విరివిగా చేపడుతున్నందుకు నియోజకవర్గ ప్రజల తరఫున ఆయన సీఎం కేసీఆర్, మంత్రిత కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా నియోజకవర్గంలో ఇప్పటికే పూర్తయి వినియోగంలో ఉన్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లతో పాటు నిర్మాణంలో ఉన్న పైవంతెనలు, అండర్ పాస్‌లతో రూపొందించిన వీడియోను కేటీఆర్‌తో పంచుకున్నారు.
తొలుత అయ్యప్ప సొసైటీ అండర్ పాస్‌తో ప్రారంభమైన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాలను విస్తరించి బయో డైవర్సిటీ, రాయదుర్గం ఫ్లై ఓవర్లు, దుర్గం కేబుల్‌పై ప్రపంచ ప్రఖ్యాత కేబుల్ వంతెన సహా, ఐకియా అండర్ పాస్ నిర్మాణాలను పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యకు సింహభాగం పరిష్కారం చూపారని గాంధీ పేర్కొన్నారు. అంతటితోనే ఆగకుండా కొత్తగూడ ఫ్లైఓవర్, శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్లను శరవేగంగా నిర్మిస్తున్నారని, వాటి ద్వారా ఐటీ కారిడార్‌లో రాకపోకలు మరింత సులభమవుతున్నాయన్నారు. ఐటీకి వేదికగా ఉన్న శేరిలింగంపల్లికి తగు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నందుకు తన ట్విట్టర్ ఖాతా వేదికగా విప్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు.