చిక్కడపల్లి, నవంబర్11: రాంనగర్ డివిజన్ పాలమూరు బస్తీలో నివాసం ఉంటున్న కే స్వరూప అనే దళిత మహిళ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్న జే శ్రీనుపై చిక్కడపల్లి పోలీసులకు ఎస్సీఎస్టీ కేసు నమోదుచేయాలని ఫిర్యాదు చేసింది. 9 వ తేదీన ఫిర్యాదు చేశామని ఇప్పటీ వరకు పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. వారితో తమకు ప్రాణహాని ఉందని, పోలీసులు ఫిర్యాదు చేస్తే తన కుమారులపై కేసులు నమోదు చేయిస్తామని బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు. బాధితురులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతుందని అడ్మిన్ ఎస్స్ఐ వెంకటరమణ తెలిపారు. దాడి జరిగిందని తేలితే దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని వివరణ ఇచ్చారు.
కాగా శుక్రవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో బాధితురాలు మాట్లాడారు. డాక్టర్ లక్ష్మణ్ అండ చూసుకుని శ్రీను అతని కుటుంబ సభ్యులు తనతో పాటూ తన భర్తపై దాడి చేశారని, కులం పేరుతో తిట్టారని అన్నారు. పాలమూరు బస్తీలో ఉన్న కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను స్థానికంగా పాలమూరు బస్తీ కమిటీ జె. శ్రీనుకు 16 నెలలకు లీజుకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. లీజు సమయం పూర్తి అయ్యిందని వివరించారు. బస్తీ అభివృద్ధి కోసమని బస్తీ కమిటీకి రూ.4,500 ప్రతి నెలా ఇవ్వాలని ఒప్పందం కూదుర్చుకోవడం జరిగిందని తెలిపారు. బస్తీ కమిటీ కోశాధికారిగా ఉన్న తన భర్త కే శ్రీను బస్తీ కమిటీ కి రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగారని చెప్పారు. డబ్బులు అడిగినప్పటీ నుంచి తమపై కోపం పెంచుకున్నాడని, డబ్బులు చెల్లించిన తర్వాత ఈ నెల9న జక్క శ్రీను తన బంధువులు, వారి కుటుంబ సభ్యులు తమ పై దాడి చేశారని తెలిపారు.
అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. కాగా డాక్టర్ కె. లక్ష్మణ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న 2016లో ప్లాంట్ ఏర్పాటు చేశారని తెలిపారు. స్థానిక బీజేపీ నాయకుల అండ ఉండడంతో శ్రీను అతని బంధువులు రెచ్చిపోతున్నారని తెలిపారు. దీనితోడు రాత్రి సమయంలో బయటి వ్యక్తులకు అక్రమంగా నీటిని తరలిస్తూ లక్షల రూపాయిలు ఆర్జీస్తున్నాడని తెలిపారు.. ముషీరాబాద్ ఎంఆర్పీఎస్ నాయకులు గజ్జల రాజశేఖర్ మాదిగ, సిద్దంగి దుర్గా ప్రసాద్ మాదిగలు మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.