ఖైరతాబాద్, నవంబర్ 7: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముదిరాజ్లందరూ టీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నంటే ఉంటారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షులు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి జగన్ ముదిరాజ్తో కలిసి మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్కు తెలంగాణ ముదిరాజ్ మహాసభ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్ నాయకత్వంలో 35వేల మంది ముదిరాజ్‌లు టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేశారన్నారు.
డాక్టర్ బండా ప్రకాశ్ భరోసాతో సుమారు 95 గ్రామాలను పర్యటించామని, అన్ని గ్రామాల్లో ముదిరాజ్‌లు టీఆర్ఎస్ పక్షాన నిలబడ్డారన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓట్లు వేసిన ప్రతి ఒక్క ముదిరాజ్‌కు పేరు పేరున అభినందనలు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర మత్స్యకార సమన్వయ కమిటీ సభ్యులు సత్తయ్య, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, వెంకట్, రాజేశ్ ముదిరాజ్ పాల్గొన్నారు.