ఇతర రాష్ర్టాల నుంచి అక్రమంగా హుక్కా సామగ్రిని తీసుకొచ్చి, భారీ ఎత్తున గోడౌన్లలో నిల్వ చేసి, వాటిని నగరంలోకి సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అక్రమంగా నిల్వ చేసిన ఇద్దరి అరెస్టు
రూ. 70 లక్షల సొత్తు స్వాధీనం
వివరాలు వెల్లడించిన టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు
సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఇతర రాష్ర్టాల నుంచి అక్రమంగా హుక్కా సామగ్రిని తీసుకొచ్చి, భారీ ఎత్తున గోడౌన్లలో నిల్వ చేసి, వాటిని నగరంలోకి సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి రూ. 70 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. మహారాష్ట్ర, ఔరంగాబాద్‌కు చెందిన అసీఫ్జ్రా హైదరాబాద్‌లోని అబిడ్స్ ప్రాంతంలో నివాసముంటూ, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో షీషా ప్యాలెస్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
అతడికి అబిడ్స్‌లో గోడౌన్ ఉంది. అందులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మోసిన్ పనిచేస్తున్నాడు. అసీఫ్ రజా అక్రమ మార్గాల్లో ఉత్తర్‌ప్రదేశ్, ముంబై నుంచి హుక్కా సామగ్రిని తీసుకొచ్చి.. తన గోడౌన్లో నిల్వ చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ బృందం గోడౌన్లో సోదాలు చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమ మార్గాల్లో హుక్కా సామగ్రిని తీసుకొచ్చి గోడౌన్లో దాచి పెట్టినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. అక్కడ లభించిన కొన్ని వస్తువులతో అగ్నిప్రమాదాలు కూడా సంభవించే ప్రమాదం ఉన్నదని పోలీసులు గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు, వారి వద్దనుంచి రూ.70 లక్షల విలువజేసే హుక్కా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.