బోడుప్పల్, నవంబర్ 5: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల దశాబ్దాల కళ నెరవేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15నుంచి 20రోజులకోసారి జరిగే తాగునీటి సరఫరాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బోడుప్పల్ ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం అయ్యింది. దీంతో బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలకు ఊరట లభించింది. ఇంటింటికీ తాగునీరు అందించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకం బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో వందశాతం విజయవంతమైంది. రూ.36.27కోట్లతో చేపట్టిన తాగునీటి సరఫరా చర్యల్లో వాటర్‌వర్క్ అధికారులు, ప్రజాప్రతినిధులు సఫలీకృతులైయ్యారు. దీంతో నగరపరిధి 28 డివిజన్లలోని 162కాలనీలకు రోజు విడిచి రోజు తాగునీరు అందిస్తున్నారు.
తాగునీటి సమస్య పూర్తిగా తొలిగిపోయింది
బోడుప్పల్ నగరపరిధిలోని దాదాపు 37వేల కుటుంబాలకు తాగునీరు అందిస్తున్నాం. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో అక్కడ అక్కడ నీటి సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఏర్పడినా సమస్యను వెంటనే అధిగమిస్తున్నాం.గతంలో 15నుంచి 20రోజులకు ఒకసారి కూడా తాగునీరు అందక ప్రజలు ఎదుర్కొన్న తాగునీటి సమస్యను ప్రభుత్వ చొరవతో సమస్యను పూర్తిగా పరిష్కరించగలిగాం. దేవేందర్‌నగర్, బొల్లిగూడెం తదితర ప్రాంతాల్లో కావల్సిన మిషన్ భగీరథ వాటర్‌ట్యాంక్‌లు ఏర్పాటు చేశాం. పెరుగుతున్న కాలనీలకు నూతన పైపులైన్లను వేసి తాగునీరు సరఫరా చేయాలని వాటర్ వర్క్ అధికారులను ఇప్పటికే ఆదేశించాం.
-సామల బుచ్చిరెడ్డి (బోడుప్పల్ నగర మేయర్)
సరిపోను నీళ్లు ఒస్తున్నయ్..
ఇప్పుడు తాగు నీటికి ఇబ్బంది లేదు. దినం తప్పించి దినం సరిపోను మస్తుగ నీళ్లు వస్తున్నయ్. కొన్నేండ్ల కింద తాగునీరు లేక చాలా కష్టాలు పడ్డం. నెలల ఒకసారన్న, రెండుసార్లు మాత్రమే నీళ్లు వచ్చేవి. అదికూడా అద్దగంటనే.నీల్లు సరిపోక ట్యాంకర్ నీల్లు పైసలు పెట్టి కొనటోల్లం. నీళ్లకే బొచ్చెడు పైసలైయ్యేది. నీళ్ల వసతిలేక చాలామంది ఇండ్లు కూడా అమ్ముకుని పోయిర్రు. మిషన్ భగీరథతో కేసీఆర్ సారు తాగునీరు వచ్చేటట్టు చేసిండు. ఇప్పుడు మా కాలనీల తాగునీటి తిప్పలు తప్పింది. ఇప్పుడు చాలా సంతోసంగా ఉంది.