మేడ్చల్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.10 లక్షలు అందజేస్తున్నదని షెడ్యూల్డ్ కులాల రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక కార్యదర్శి విజయ్‌కుమార్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన దళిత బంధు లబ్ధిదారులకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అర్హులైన వారికి రూ.10 లక్షల చొప్పున అందజేస్తున్నదని అన్నారు.
గ్రామంలో ఒకే రకం వాహనాలు కాకుండా వివిధ రకాల వాటిని కొనుగోలు చేసి వ్యాపారాలు చేసినట్లయితే మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్తారని చెప్పారు. జిల్లాలో దళితబంధు పథకం కింద మొత్తం 563 మంది అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళితబంధు పథకం సలహాదారు డాక్టర్ లక్ష్మారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి బాలాజీ, లీడ్ బ్యాంక్ మేనేజర్ కిశోర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, జడ్పీ సీఈఓ దేవసహాయం, ఆర్డీఓ మల్లయ్య, డిక్కీ సంస్థ ప్రతినిధులు అరుణ్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.