సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): పెండ్లి పేరుతో పరిచయం చేసుకొని.. గిఫ్ట్‌ల పేరుతో మోసానికి పాల్పడిన నైజీరియన్ సైబర్ చీటర్‌ను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావుభూపాల్ కథనం ప్రకారం.. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన ఒక యువతి తెలుగు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో పెట్టిన ప్రొఫైల్‌ను చూసిన సైబర్ నేరగాడు.. అమెరికా వాసినంటూ యువతికి కాల్ చేశాడు. తన పేరు వరుణ్‌రావు.. పెండ్లి చేసుకుంటానంటూ చెప్పాడు. ఇద్దరూ కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్నారు. గత జూన్ నెలలో.. విలువైన బహుమతులు పంపిస్తున్నానంటూ ఫోన్ ద్వారా యువతికి తెలిపాడు. మరుసటి రోజు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం మాట్లాడుతున్నాం..
నీ పేరుతో భారీగా బంగారు ఆభరణాలు, డాలర్లు, విలువైన ఫోన్స్, లక్షల విలువజేసే గిఫ్టులు వచ్చాయంటూ సమాచారం ఇచ్చారు. అయితే, వీటికి కస్టమ్స్ క్లియరెన్స్, యాంటీ టెర్రరిస్ట్ చార్జీస్, జీఎస్టీ తదితర చార్జీలు చెల్లించాలంటూ చెప్పి, దఫదఫాలుగా యువతి వద్ద నుంచి రూ. 18 లక్షలు వసూలు చేశారు. మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించిన ఆ యువతి సైబర్‌క్రైమ్స్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇన్స్పెక్టర్ వెంకట్రామిరెడ్డి బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. నిందితుడు ఢిల్లీలో ఉంటున్న నైజీరియాకు చెందిన అమూల్యన్స్ ప్రిన్స్ ఫెలిక్స్(50)గా గుర్తించి, అరెస్టు చేసి నగరానికి తరలించారు. నిందితుడి వద్ద నుంచి మూడు ల్యాప్టాప్స్, 8 మొబైల్ ఫోన్లు, 10 సిమ్‌కార్డులు, రెండు డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్ సీపీ తెలిపారు. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి, కె.మధుసూదన్ బృందం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.