మియాపూర్, అక్టోబర్ 17 : నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణను ఉచితంగా అందించి ఉపాధి కల్పించే కార్యక్రమం నగరంలోనే తొలిసారిగా చందానగర్ సర్కిల్లో ప్రారంభమైంది. పుణెకు చెందిన లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని బల్దియా సౌజన్యంతో నిర్వహిస్తున్నది. అయితే ఇందుకు పైలట్ ప్రాజెక్టుగా చందానగర్ సర్కిల్‌ను ఎంచుకున్న నేపథ్యంలో పరిసర నిరుద్యోగ యువత దీనిని సద్వినియోగం చేసుకునేలా సర్కిల్ అధికారులు తగు చర్యలు చేపడుతున్నారు. సదరు సంస్థ అభ్యర్థన మేరకు చందానగర్ సర్కిల్ పరిధిలోని రైతుబజార్‌ను పూర్తి స్థాయి వసతులతో సిద్ధం చేస్తున్నారు. అప్పటివరకు చందానగర్‌లోని సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్యాణ మండపంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. జడ్సీ శంకరయ్య, డీసీ సుధాంశ్ నందగిరి ఆదేశాల మేరకు సర్కిల్ పీవో ఉషారాణి సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి అభ్యర్థులకు అవగాహన కల్పించారు.
కమ్యూనికేషన్ స్కిల్స్‌లో శిక్షణ
లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 60 రకాల అంశాలపై దేశంలోని ఆరు రాష్ర్టాలలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా చందానగర్ కేంద్రంగా కొనసాగనున్న ఈ శిక్షణలో కమ్యూనికేషన్ స్కిల్, స్పోకెన్ ఇంగ్లిష్ , కంప్యూటర్లో బేసిక్స్, టైలరింగ్, బ్యూటీషియన్, అకౌంట్స్, జాబ్ ట్రైనింగ్ సహా మరి కొన్ని అంశాలలో అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. తొలి బ్యాచ్‌కు 40 మంది నుంచి దరఖాస్తులు రాగా తొలి రోజు శిక్షణకు సుమారు 15 మంది హాజరయ్యారు. 3 నుంచి 6 నెలల పాటు శిక్షణ అందించి ఆయా సంస్థలలో ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు.
కంప్యూటర్ కోర్సు నేర్చుకునేందుకు చేరా..
ఉచిత శిక్షణ ఉపాధి గురించి మీడియా ద్వారా తెలుసుకొని ఇందులో చేరా. కంప్యూటర్ కోర్సులపై ఆసక్తి ఉంది. అందుకే కంప్యూటర్లో బేసిక్స్‌పై ఇచ్చే శిక్షణలో చేరా. తొలి రోజు వీడియో ద్వారా శిక్షణ అంశాలపై అవగాహన కల్పించారు. చాలా ఆసక్తిగా అనిపించింది. నిరుద్యోగులకు ఈ తరహా ఉచిత శిక్షణను అందించి ఉపాధి కల్పించనున్న అధికారులకు, ఈ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు. శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులంతా గృహిణులే అయినందున తగు సమయాలను నిర్ణయించాలని కోరుకుంటున్నాం.
– లావణ్య, అభ్యర్థిని
పైలట్ ప్రాజెక్టుగా చందానగర్ సర్కిల్
లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ జీహెచ్ఎంసీ సౌజన్యంతో ఉచిత శిక్షణ ఉపాధి కార్యక్రమానికి చందానగర్ సర్కిల్‌ను పైలట్ ప్రాజెక్టుగా చందానగర్ సర్కిల్‌ను ఎంచుకోవడం సంతోషకరం. పరిసర ప్రాంత నిరుద్యోగులు సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాం. మున్ముందు ఇంకా ఎక్కువ మంది నిరుద్యోగులు ముందుకు వచ్చేలా కృషి చేస్తాం. శిక్షణను అందించేందుకు సర్కిల్లో ఓ భవనాన్ని అన్ని సౌకర్యాలతో సిద్ధం చేస్తున్నాం. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని కోరుతున్నాం.
– ఉషారాణి, పీవో, చందానగర్ సర్కిల్