సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): స్వైన్‌ఫ్లూ.. ఐదేండ్ల కిందట చలికాలం వచ్చిందంటే దడపుట్టేది. కరోనా స్థాయిలో కాకపోయినా.. అప్పట్లో స్వైన్‌ఫ్లూ కొంత కలకలం సృష్టించింది. చలికాలంలో ఈ కేసులు ఊపందుకునేవి. క్రమంగా తగ్గుముఖం పట్టింది. కరోనా ప్రభావంతో 2020 నుంచి స్వైన్‌ఫ్లూ నామరూపం లేకుండా పోయింది. రెండేండ్ల తర్వాత మరోసారి స్వైన్‌ఫ్లూ పేరు మళ్లీ వినిపిస్తున్నది. అక్కడక్కడ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కొంత ఉపశమనం పొందుతున్న సమయంలో పదుల సంఖ్యలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతుండటం కొంత మేరకు ఆందోళన కలిగిస్తున్నది. అయితే, స్వైన్‌ఫ్లూకు సంబంధించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం స్వైన్‌ఫ్లూ సాధారణ ఫ్లూగానే ఉంటున్నదని, కేసులు కూడా చెప్పుకోదగిన రీతిలో లేవని వైద్యులు చెబుతున్నారు.
సాధారణ ఫ్లూనే..:
వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం ‘సి’ కేటగిరి రోగులకు మాత్రమే స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. అది కూడా త్రోట్ స్వాబ్ నమూనాలను ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షల ద్వారా పరీక్షించి నిర్ధారిస్తారు. తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సమస్య, హార్ట్ రేట్ పడిపోవడం వంటి తీవ్ర లక్షణాలు ఉండి.. కోమార్పిడిటిస్ ఉన్న రోగులు ‘సి’ కేటగిరిలోకి వస్తారని వైద్యులు చెప్పారు. అయితే, కొన్ని ప్రైవేటు దవాఖానల నిర్వాహకులు ఏ, బీ కేటగిరీ రోగులకు స్వైన్‌ఫ్లూ పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ పేరుతో చికిత్స అందిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. సాధారణ జలుబు, దగ్గు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలు ఏ,బీ కేటగిరిలోకి వస్తాయని వైద్యాధికారులు తెలిపారు. జలుబు, జ్వరంతో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే.. స్వైన్‌ఫ్లూ పేరుతో అడ్మిట్ చేసుకుని చికిత్స చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రికార్డుల్లో నమోదవుతున్న కేసులన్నీ.. సాధారణ ఫ్లూ కేసులుగానే తమ విచారణలో స్పష్టమవుతున్నట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
కేసులు పెద్దగా లేవు..
– డాక్టర్ వెంకటి, హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
నగరంలో స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఐదారేండ్ల కిందట దాని ప్రభావం కొంత వరకు ఉండేది. క్రమంగా వైరస్ రూపాంతరం చెంది ప్రస్తుతం సాధారణ ఫ్లూగా మారిపోయింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో అడపాదడపా ఈ వైరస్ లక్షణాలు కనబడవచ్చు. చెప్పుకోదగిన రీతిలో మాత్రం స్వైన్‌ఫ్లూ ప్రభావం లేదు. అయితే, కొన్ని ప్రైవేటు దవాఖానల్లో సాధారణ ఫ్లూను కూడా వారు స్వైన్‌ఫ్లూ పేరుతో పరీక్షలు నిర్వహించి, చికిత్స చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై పూర్తిస్థాయి సమాచారం సేకరిస్తున్నాం. అనవసరంగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు.