దుండిగల్, అక్టోబర్17: అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి చెరువులో శవమై తేలాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాథోడ్ రాజశేఖర్ కుమారుడు రాథోడ్ రోహిత్ (21) దుండిగలోని ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలో(ఐఏఆర్ఇ) బీటెక్ మూడో సంవత్సరం చదువుతూ.. గండిమైసమ్మలోని బీఆర్ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 13న రాజశేఖర్ తన కుమారుడు రోహిత్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన అతడు హాస్టల్‌కు రాగా.. కుమారుడు కనిపించలేదు. కాలేజీకి కూడా రెండు రోజులుగా రావడం లేదని తెలుసుకొని, దుండిగల్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సోమవారం ఉదయం డీ పోచంపల్లిలోని కుడికుంట చెరువులో యువకుడి మృతదేహం తేలిందని స్థానికుల ద్వారా పోలీసులు సమాచారం అందుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అది రోహిత్ మృతదేహంగా గుర్తించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ వైద్యశాలకు తరలించారు.
మృతిపై అనుమానాలెన్నో..?
మొదట్లో రోహిత్ మరికొందరు స్నేహితులతో కలిసి గండిమైసమ్మలోని ఓ అద్దె గదిలో ఉన్నాడు. ఇటీవలే స్థానికంగా ఉన్న బీఆర్ బాయ్స్ హాస్టల్లో చేరాడు. 13వ తేదీ రాత్రి తోటి విద్యార్థులతో గొడవ జరిగిందని తెలిసింది. అది హాస్టల్ గదిలోనా.? గతంలో ఉన్న అద్దె గదిలోనా…? అన్న విషయం ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో 14వ తేదీ తెల్లవారుజామున రోహిత్ ఒక్కడే నడుచుకుంటూ వెళ్లిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు సేకరించినట్లు తెలిసింది. ఉదయం 4.30 నుంచి అతడి మొబై ల్ స్విచ్ఛాఫ్ అయిందని, స్నేహితులతో గొడవ జరిగిన కారణంగానే మనస్తాపానికి గురై చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? ఎవరైనా బెదిరించడంతో భ యపడి ఇలా చేశాడా…? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ అమ్మాయి విషయంలో ఈ గొడవ జరిగినట్లు సమాచారం. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని.. పోస్టుమార్టం నివేదిక వస్తే స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు.