బంజారాహిల్స్, అక్టోబర్ 17: మొబైల్ గేమ్స్‌కు అలవాటు పడిన ఓ బాలుడు మనోవ్యధకు లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నం. 11లోని ఉదయ్‌నగర్‌లో నివాసముంటున్న పోతురాజ్ ప్రశాంత్(15) స్థానిక సరస్వతీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తల్లి స్వరూప అదే స్కూల్లో ఆయాగా పనిచేస్తుండగా.. తండ్రి శ్రీనివాస్ కారు డ్రైవర్. కొంతకాలంగా మొబైల్ ఫోన్లో గేమ్స్‌కు అలవాటు పడిన ప్రశాంత్ చదువుపై దృష్టి పెట్టడం లేదు.
స్కూల్‌కు వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపకపోవడంతో పాటు అస్తమానం మొబైల్‌ఫోన్‌ను వాడుతూ కనిపించడంతో ఇటీవల కుటుంబసభ్యులు అతడి వద్ద నుంచి ఫోన్ లాక్కున్నారు. అప్పటి నుంచి మనోవ్యధ చెందాడు. స్నేహితులతో కూడా సరిగా మాట్లాడటం లేదు. ఇదిలా ఉండగా.. సోమవారం ప్రశాంత్ పుట్టిన రోజు కావడంతో స్నేహితులకు చాక్లెట్స్ కొనేందుకు తండ్రి శ్రీనివాస్ రూ.200 ఇచ్చాడు.
తల్లిదండ్రులిద్దరూ డ్యూటీకి వెళ్లగా.. పెద్దకొడుకు భాను ప్రసాద్ కాలేజీకి వెళ్లాడు. మధ్యాహ్నం తల్లి స్వరూప లంచ్ కోసం ఇంటికి వచ్చి చూడగా.. ప్రశాంత్ గదిలో చీరతో ఉరేసుకుని కనిపించాడు. పుట్టిన రోజునాడే కొడుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లి స్వరూపతో పాటు కుటుంబసభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించడంతో స్థానికులు సైతం కన్నీళ్లపర్యంతమయ్యారు. మొబైల్ఫోన్లో గేమ్స్‌కు బానిస కావడంతోనే ప్రశాంత్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని స్థానికులతో పాటు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.