బంజారాహిల్స్, అక్టోబర్ 17: నగరవ్యాప్తంగా రెండు వారాల కిందట ప్రారంభించిన ఆపరేషన్ రోప్ స్పెషల్ డ్రైవ్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు జంక్షన్ వద్ద ఆపరేషన్ రోప్ కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు సోమవారం అదనపు పోలీసు కమిషనర్ రంగనాథ్, వెస్ట్‌జోన్ ట్రాఫిక్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ జ్ఞానేందర్‌రెడ్డి కలిసి వచ్చారు.
ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. స్టాప్ లైన్ పాటించడం, ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేయకుండా ట్రాఫిక్ సాఫీగా సాగేందేకు నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ ఆదేశాలతో ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఆపరేషన్ రోప్‌పై ప్రజల్లో అవగాహన పెరిగినా, కొంతమంది మాత్రం ఇంకా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రెండు రోజులుగా ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై జరిమానాలు విధిస్తున్నట్టు తెలిపారు. నగరంలోని కొన్ని వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, పబ్స్ తదితర ప్రాంతాల్లో సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారని చెప్పారు. అలాంటి సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ రద్దీ సమయాల్లో పార్కింగ్ చేయకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింగరాజు తదితరులు పాల్గొన్నారు.