సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): నగర రోడ్లపై పౌరులు సాఫీగా ప్రయాణం సాగించేందుకు హైదరాబాద్‌లో మొదలు పెట్టిన ఆపరేషన్ ‘రోప్’ మంచి ఫలితాలు ఇస్తున్నది. ఇక నుంచి ఈ ఆపరేషన్ నగరంలో మరింత ఉధృతం చేయనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు స్టాప్ లైన్ ముందు ఆగడం, ఫ్రీ లెఫ్ట్‌లను వదిలేయడం, రోడ్లపై క్యారేజ్ వేలను సాఫీగా ఉంచడంలో వాహనదారులలో అవగాహన పెరుగుతున్నది. ఒక వైపు అవగాహన కల్పిస్తున్న పోలీసులు, మరోవైపు క్రమ శిక్షణ తప్పే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 15 నుంచి నిర్వహిస్తున్న ఈ డ్రైవ్‌లో మొదటి రెండు వారాలు అవగాహనపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఉల్లంఘనలకు పాల్పడే వారిపై జరిమానాలు వేస్తున్నారు. ఫుట్‌పాత్ ఆక్రమణలు, క్యారేజ్ వేలు ఆక్రమించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆపరేషన్ ‘రోప్’ (రిమూవబుల్ అబ్స్ట్రాక్టివ్ పార్కింగ్ ఎంక్రోచ్మెంట్)ను ప్రారంభిస్తూ 100 శాతం ప్రజలకు ట్రాఫిక్ విభాగంతో సంబంధం ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోడ్డుపై వెళ్తుంటారని, ఎవరు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా సాఫీగా తమ ప్రయాణాలు సాగిస్తే అదే హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ మొత్తానికి మంచి పేరు తెస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ విభాగం అధికారులకు సూచించారు..
నగరంలో ఉన్న ఒక్కొక్క ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రకమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో సాఫీగా ప్రయాణాలు సాగుతాయి. దీనికి అన్ని ప్రభుత్వ శాఖల సహకారం తీసుకుంటూ నగర ట్రాఫిక్ పోలీసులు క్షేత్ర స్థాయిలో సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ, ఆర్టీసీ అధికారులతో నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ సమన్వయ సమావేశాలు నిర్వహించి, సమస్యలు పరిష్కరించే మార్గాలపై కలిసి చర్చిస్తున్నారు. ప్రధానంగా బస్ షెల్టర్లతో సమస్యలు ఉండటంతో వాటిని మార్చాలని, అలాగే జంక్షన్లను అభివృద్ది చేయడం, సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్, జీబ్రా లైన్ సరిగా ఉండే విధంగా చూడటం, రోడ్డు ఇంజినీరింగ్ వంటి సమస్యలను పరిష్కరించాలని జీహెచ్ఎంసీ అధికారులతో చర్చిస్తున్నారు.
ఆపరేషన్ రోప్‌తో రోడ్లపై అడ్డదిడ్డమైన పార్కింగులు, రోడ్డు ఆక్రమణలు ఫ్రీ అవుతున్నాయి. 111 జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌లు ఏర్పాటు చేశాం. ఫ్రీ లెఫ్ట్, రోడ్డు బ్లాక్ చేయవద్దంటూ వాహనదారులకు అర్థమయ్యే విధంగా బోర్డులు ఏర్పాటు చేశాం. అయినా.. వాహనదారులు ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే అలాంటి వారిపై జరిమానాలు విధిస్తున్నాం. అలాగే, స్టాప్ లైన్ వద్ద ఆగాలని సూచనలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నాం. స్టాప్‌లైన్ దాటుతున్న వారిపై జరిమానాలు విధిస్తున్నాం. ప్రధాన రోడ్లను ఆక్రమించుకొని ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించే వ్యాపార సముదాయాలు, వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తున్నాం. ప్రజల సహకారంతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేలా నిరంతరం ప్రయత్నిస్తున్నాం.
-ఏవీ రంగనాథ్, జాయింట్ సీపీ