బన్సీలాల్‌పేట్, అక్టోబర్ 14 : సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటున్నానని, అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్‌పేట్ డివిజన్లోని న్యూబోయిగూడ ప్రాంతంలో శుక్రవారం రూ.97 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కార్పొరేటర్ హేమలతతో కలిసి శంకుస్థాపన చేశారు. గాంధీనగర్ కాలనీలో రూ.45.50 లక్షలతో నూ తన కమ్యూనిటీ హాల్ నిర్మాణం, గొల్ల కొమరయ్య కాలనీలో రూ.15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం, రూ.20.50 లక్షలతో డ్రైనేజీ పైపులైన్ల ఏర్పాటు, కట్టెలమండి మార్గంలో రూ.9.80 లక్షలతో తాగునీటి పైప్‌లైన్ పనులు, డాన్‌బాస్కో హాస్టల్ సమీపంలో రూ.6.75 లక్షలతో తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు పనులను ప్రారంభించారు. నడుచుకుంటూ వెళుతూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.
అత్యధికంగా డబుల్ బెడ్రూం ఇండ్లను సనత్‌నగర్‌లోనే నిర్మించామని, మేకలమండి నుంచి ఇస్లామియా స్కూల్ వరకు విశాలమైన వీడీసీసీ రోడ్డు వేశామని మంత్రి తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా గాంధీ దవాఖాన వద్ద 16 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేశామని, బన్సీలాల్‌పేట్‌లో చారిత్రాత్మక మెట్ల బావి పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో మెట్లబావి ప్రాంతం సుందర పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు.
జలమండలి జీఎం రమణారెడ్డి, డీజీఎం వెంకట్రావు, జీహెచ్ఎంసీ బేగంపేట్ డీసీ ముకుందరెడ్డి, ఈఈ సుదర్శన్, డీఈఈ ఆంజనేయులు, ఏఈ నవీన్, గాంధీనగర్ కాలనీ అధ్యక్షుడు రవికుమార్, కార్యదర్శి రవికాంత్, అరుణ్గౌడ్, దయానంద్, కొమరయ్య కాలనీ అధ్యక్షుడు కృష్ణ, కార్యదర్శి నర్సింగ్‌రావు, వినోద్, మనీశ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, ప్రధాన కార్యదర్శి రాజేందర్, లక్ష్మీపతి, కమల్‌కుమార్, ప్రేమ్‌కుమార్, లంకరాజు, రజాక్, అబ్బాస్, ఫహీమ్, విజయ్‌శంకర్, శ్రీలక్ష్మి, అమృత, నాగలక్ష్మి,కల్యాణ్‌రామ్ పాల్గొన్నారు.