మేడ్చల్, అక్టోబర్ 14: ‘ఆసరా’ పథకం నిరుపేదల పాలిట వరంగా మారి వారి జీవితాలకు ఆర్థిక భరోసాను కల్పించింది. సంక్షేమం బాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్ పథకం ‘ఆసరా’ ఎంతో మంది జీవితాలకు వెగులునిస్తుంది. వృద్ధాప్యంలో ఒకరి మీద ఆధారపడకుండా గౌరవంగా బతికే అవకాశం పండుటాకులకు కల్పిస్తోంది. వికలాంగులకు ఊత కర్ర అవుతుంది. వితంతవులకు భరోసానిస్తుంది. ఇలా ఆయా వర్గాలకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతి నెలా వచ్చే పింఛన్తో వృద్ధులు మందులు, రోజువారీ ఖర్చులకు వినియోగించుకుంటున్నారు. ఇక కుటుంబ సంపాదన అంతంత మాత్రంగా ఉండి, పిల్లల నిరాదరణకు గురైన వారు ఎవరికి చేయి చాచాల్సిన అవసరంలేని పరిస్థితులను కల్పిస్తుంది. ఆసరా పింఛన్లు మంజూరైన వారిని కదిలిస్తే తమ పరిస్థితిని వివరిస్తూ కేసీఆర్ నిరుపేదల పాలిట దేవుడయ్యాడని కొనియాడారు. తమకు ఆసరా డబ్బులు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆనందం వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలోని ఐదు మండలాలు, ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లకు కొత్తగా 10,348 పింఛన్లు మంజూరయ్యాయి. మేడ్చల్, శామీర్పేట, ఘట్కేసర్, కీసర, మూడుచింతపల్లి మండలాలకు 4,268, అలాగే 10 పురపాలికలకు 6,080 పింఛన్లు మంజూరైనాయి. గతంలో ఐదు మండలాలకు సంబంధించి 13,985, పురపాలికలకు 15,398 పింఛన్లు వస్తున్నాయి. కొత్తవి, పాతవి కలుపుకుంటే నియోజకవర్గానికి 39,731 వస్తున్నాయి.
పక్షపాతం వచ్చి మంచానికే పరిమితమయ్యాను. నా భార్య ఏదో పని చేస్తూ ఇల్లు నెట్టుకొస్తుంది. గతంలో తిండికి, మందులకు ఇబ్బంది అవుతుండేది.. ‘ఆసరా’ పింఛన్ రావడంతో చాలా సంతోషంగా ఉంది. ఇంతకునుందు ఇంటికి భారమైనట్టు అన్పించేది. పింఛన్ పైసలు వస్తుండటంతో బతుకుపై భరోసా వచ్చింది.
– నీలం యాదగిరి, నాగారం
బర్లు కాస్తూ బతుకుతున్నాను. ఆ డబ్బులతో ఇల్లు గడవటం కష్టంగా ఉండే ది. సొంత ఇల్లు కూడా లేదు. కిరాయి కట్టాలి, పిల్లల అవసరాలకు మస్తు ఇబ్బందిగా ఉండే.. పింఛన్ పైసలతో చిన్న చిన్న అవసరాలు తీరుతాయి. మాలాంటోళ్లకు పెద్ద కొడుకులా ఆదుకుంటుండు.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారూ సల్లంగుండాలే.
– పోచయ్య, దమ్మాయిగూడ
చిన్నతనంలోనే భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న. పిల్లలను చదివించడం ఇబ్బందిగా ఉండే.. చిల్లర కొట్టు పెట్టుకొని బతుకుతున్న.. అద్దె ఇంట్లో ఉండి, ఫీజులు కట్టలేకపోతున్నా. ఆసరా పింఛన్ ఇచ్చి ముఖ్యమంత్రి సారూ.. కేసీఆర్ ఆదుకున్నాడు. ఇది నా కష్టానికి తోడవుతుంది. పిల్లల ఫీజులకు సాయం అవుతుంది.
– పందిరి శశికళ, ఎస్ఎఫ్సీ నగర్
భర్త, కొడుకులు లేరు ముసలితనంతో కష్టపడలేను. కిరాయి ఇంట్లో ఉంటున్నా, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో పింఛన్ల మంజూరు కావడం సంతోషంగా ఉంది. మందులకు, కిరా యి కట్టుకోవడానికి కొంత ఉపయోగపడుతుంది. కేసీఆర్ సొంత కొడుకు లెక్క అర్థం చేసుకుని మాకు ఆసరా అవుతున్నాడు.
– సాబీర్ ఉన్నీసా బేగం, ఎస్ఎఫ్సీ నగర్