సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు గ్రేటర్లో వాన దంచి కొట్టింది. పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలోని సెల్లార్లు పూర్తిగా నీట మునిగాయి. వెంటనే స్పందించిన బల్దియా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే తూర్పు/ ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం పైపునకు గాలులు వీస్తుండడం వల్ల రాగల మూడు రోజులు గ్రేటర్ హైదరాబాద్‌లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గురువారం రాత్రి 8.30 గంటల వరకు గ్రేటర్లో ఎక్కడ కూడా వర్షపాతం నమోదు కాలేదని టీఎస్‌డీపీఎస్ అధికారులు తెలిపారు.
మూసీలోకి కొనసాగుతున్న వరద..ఆరుగేట్లు ఎత్తివేత
సిటీ బ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి గడిచిన కొన్ని రోజులుగా జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో ఉస్మాన్సాగర్కి 2000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దిగువ మూసీలోకి ఆరు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 2748 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. హిమాయత్ సాగర్‌కు ఎగువ నుంచి 2500 క్యూసెక్కుల నీరు వస్తుండగా, మూడు గేట్లు రెండు అడుగుల ఎత్తి 2812 క్యూసెక్కుల నీరు మూసీలోకి చేర్చుతున్నారు. జంట జలాశయాల నుంచి 5560 క్యూసెక్కుల నీరు మూసీలోకి వెళుతుందని, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు జలమండలి అధికారులు పేర్కొన్నారు.