మేడ్చల్, అక్టోబర్13 (నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనందిస్తున్నది. ఒకపక్క పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తూనే.. మరో పక్క ఏర్పాటు చేసుకున్న పరిశ్రమలు ఆర్థికంగా నష్టపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ పరిశ్రమల్లో తయారైన వివిధ ఉత్పత్తులను తీసుకున్న వ్యాపారులు.. ఆ ఉత్పత్తులకు సంబంధించిన బకాయిలు చెల్లించే విధంగా ప్రభుత్వం పరిశ్రమల రీజినల్ కౌన్సిల్ (పరిష్కార వేదిక) ద్వారా చర్యలు చేపట్టింది. వ్యాపారులు బాకాయిలను పరిశ్రమలకు చెల్లించే విధంగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్, సిద్దిపేట, మెదక్, నల్గొండ జిల్లాల పరిధిలోకి వచ్చే వివిధ పరిశ్రమలకు రావాల్సిన బకాయిలు రూ. 68 కోట్లను రికవరీ చేసి.. పరిశ్రమల యజమానులకు రీజినల్ కౌన్సిల్ అందించింది.
బకాయిలపై రీజినల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు..
వివిధ పరిశ్రమలకు ఉత్పత్తుల ద్వారా రావాల్సిన బకాయిలపై రీజినల్ కౌన్సిల్‌కు ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటున్నారు. ఆన్లైన్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పరిశీలన అనంతరం రీజినల్ కౌన్సిల్ చైర్మన్ పరిశ్రమల యజమానులు, ఉత్పత్తులు తీసుకున్న వ్యాపారులతో చర్చిస్తారు. పత్రాల ఆధారంగా బకాయిలు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంటారు. లేనట్లయితే ఎంఎస్ఎంఈడీ 2008 యాక్ట్ ప్రకారం వ్యాపారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
రీజినల్ కౌన్సిల్ ద్వారా రూ. 68 కోట్ల రికవరీ
పరిశ్రమల నుంచి తీసుకున్న వివిధ ఉత్పత్తులకు బకాయిలు చెల్లించని 177 మంది వ్యాపారులకు రీజినల్ కౌన్సిల్ ద్వారా నోటీసులు జారీ చేశాం. మరిన్ని బకాయిలపై త్వరలోనే కౌన్సిల్లో నిర్ణయం తీసుకుంటాం. రూ.85 కోట్లకు సంబంధించిన బకాయిల్లో ఇప్పటి వరకు రూ. 68 కోట్లు రికవరీ అయ్యాయి. పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రీజినల్ కౌన్సిల్ ద్వారా పరిశ్రమలకు తోడ్పాటు అందిన్నాం.
– రవీందర్, చైర్మన్. పరిశ్రమల రీజినల్ కౌన్సిల్