హయత్‌నగర్, అక్టోబర్ 13: చిన్నారులను బంధించి.. భౌతికంగా దాడికి పాల్పడిన సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. యాదాద్రి- భువనగిరి జిల్లా, నారాయణపూర్ మండలం, వాయిలపల్లి తండాకు చెందిన కరంటోతు శ్రీను, జ్యోతి దంపతులు. వీరు కూతురు శిరీష, కుమారులు చరణ్, విక్రమ్‌తో నగరానికి వలస వచ్చి పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని సూర్యవంశీ కాలనీలో ఉన్న దేవునూరి రాధాకృష్ణ ఇంటికి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. శ్రీనుకు ఆరోగ్యం బాగాలేనందున భార్య జ్యోతిని వెంటతీసుకొని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లాడు.
కూతురు శిరీష కళాశాలకు వెళ్లగా.. ఇద్దరు కుమారులు చరణ్, విక్రమ్, బంధువుల కుమారుడు మెగావత్ చరణ్ ముగ్గురూ కలిసి ఇంటి వద్దనే ఉంటున్నారు. మురళీకృష్ణ అనే వ్యక్తి మంగళవారం అక్రమంగా వీరి ఇంట్లోకి ప్రవేశించి.. ముగ్గురు పిల్లలను చితకబాది దుర్భాషలాడాడు. వారిని ఇంట్లోనే బంధించి తాళాలు వేసి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తాళాలు పగులగొట్టి పిల్లలను బయటకు తీశారు. పిల్లలను అడిగి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు మురళీకృష్ణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.