కాప్రా, అక్టోబర్ 13: కాప్రా సర్కిల్ పరిధిలో వన్ టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్) ద్వారా ఆస్తిపన్ను బకాయిల వసూళ్లు గణనీయంగా పెరిగాయి. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల్లో కొంతమంది ఆస్తిపన్నును ఏండ్లతరబడి చెల్లించకపోవడంతో వడ్డీతో సహా వారి బకాయిలు బాగా పేరుకుపోయాయి. అలాంటి వారికి ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్మెంట్ అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా బకాయిల వడ్డీ 90శాతం మేర మాఫీ చేయగా, పది శాతం వడ్డీతో ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఓటీఎస్ అవకాశం ఈ నెలాఖరున ముగియనుంది. జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ పరిధిలో 3,973 మంది ఓటీఎస్ అవకాశాన్ని వినియోగించుకున్నట్లు సర్కిల్ రెవెన్యూ వర్గాలు తెలిపాయి. వీరి ద్వారా రూ.3.41కోట్ల ఆస్తిపన్ను అసలు, రూ.60లక్షల మేర వడ్డీ, మొత్తం రూ. 4.01 కోట్లు వసూలయ్యాయి. ఓటీఎస్‌కు గడువు ఇంకా 17 రోజులు మాత్రమే మిగిలి ఉంది.
సద్వినియోగం చేసుకోండి ..
ఆస్తిపన్ను బకాయిల వడ్డీని 90 శాతం మేర మాఫీ చేస్తూ ప్రభుత్వం కల్పించిన ఓటీఎస్‌కు ప్రాపర్టీ యజమానులు స్పందిస్తున్నారు. పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు.. ఇంకా కట్టనివారు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. బకాయిలను వెంటనే చెల్లించాలి .
– శంకర్, డిప్యూటీ కమిషనర్, కాప్రా సర్కిల్