హయత్‌నగర్, అక్టోబర్ 7 : భారతదేశ అభివృద్ధిలో సీఎం కేసీఆర్ సేవలు చాలా అవసరమని బీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గం మహిళా విభాగం మాజీ జనరల్ సెక్రటరీ, ఉద్యమకారిణి తోగూట లీల శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలువురు పార్టీ మహిళలతో కలిసి సమావేశమయ్యారు. బీజేపీ పాలనలో ప్రజా వ్యతిరేక విధానాల అమలు వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్యుడిపై పెనుభారం పడుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కంటినిండ నిద్రలేకుండా ఉద్యమధీరుడు కేసీఆర్ పిలుపు మేరకు అన్ని రకాల బంద్‌లు, రాస్తారోకోలు వంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేశామని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ పాలనలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ఆనందం వ్యక్తంచేశారు.
తెలంగాణలో మహిళా సంక్షేమం కోసం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, షీటీమ్స్‌తో రక్షణ, రైతులకు రైతుబంధు, రైతుబీమా, డబుల్ బెడ్రూం ఇడ్లు, దళితులకు దళిత బంధు వంటి అనేక సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్నారని కొనియాడారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో తెలంగాణ లాంటి అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని, ఒక్క తెలంగాణ అభివృద్ధి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
ప్రపంచ స్థాయిలో పెట్టుబడి కంపెనీలు తెలంగాణలో నూతన కంపెనీల స్థాపనకు వలసబాట పడుతున్నాయని, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా సురక్షిత ప్రాంతమైన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్నాయని వివరించారు. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో సీఎం కేసీఆర్‌తోనే పూర్తిస్థాయి అభివృద్ధి సాధ్యమవుతుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. దీంతో దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు రేవతి, లతామణి, రాధిక, అనిత తదితరులు పాల్గొన్నారు.