సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆదివారం అంటేనే అందరికీ ఆటవిడుపు.. సరదాగా సండేను గడపడం అంటేనే అమితాసక్తిని చూపిస్తుంటారు. అలాంటిది ఈ ఆదివారం నగర వాసుల్లో సరికొత్త జోష్ నింపింది. ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ-20 మ్యాచ్ ఒకవైపు… మరోవైపు దేశంలోనే మొట్ట మొదటిసారిగా నగరం వేదికగా నిర్వహిస్తున్న ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌కు సంబంధించిన కార్ల ప్రదర్శన… అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సైక్లింగ్ ఈవెంట్‌ను దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ఐటీ కారిడార్‌లో నిర్వహించడం నగర వాసుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఒకే రోజు.. ఒకేసారి… అది కూడా ఆదివారం మూడు ఈవెంట్లు రావడంతో నగర వాసులు ఆనందంతో పొంగిపోయారు. మూడేండ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఇందుకు వారం రోజుల ముందు నుంచే టికెట్ల కోసం నగర వాసులు ఎగబడ్డారు. ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లోనే కాదు అందరిలోనూ ఒక రకమైన జోష్ నింపింది. క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ఆర్టీసీ, మెట్రో రైలు సంస్థలు ప్రత్యేకంగా బస్సులను, మెట్రో రైళ్లను అర్ధరాత్రి వరకు నడిపించాయి.
నగరంలో రెండు చోట్ల ఫార్ములా- ఈ కార్ల ప్రదర్శన..
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌తో పాటు మరో అంతర్జాతీయ క్రీడగా దేశంలోనే మొట్టమొదటి సారిగా ఫార్ములా – ఈ కారు రేసింగ్‌కు సంబంధించిన హడావుడి నగరంలో మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న నగరంలో జరిగే ఫార్ములా – ఈ కారు రేసింగ్‌లో పాల్గొనే రెండు కార్లను దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైన, ట్యాంక్‌బండ్‌పైన ప్రత్యేకంగా ప్రదర్శించారు. దుర్గం చెరువుపై ఏర్పాటు చేసిన ఫార్ములా – ఈ కారును రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన ఫార్ములా – ఈ కారును హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బి.ఎం.సంతోష్ ప్రారంభించారు. కార్లను చూసేందుకు నగర వాసులు ఎగబడ్డారు. ముఖ్యంగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఉదయం సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేసి ఫార్ములా – ఈ కారును ప్రదర్శించి, దానికి సంబంధించిన ప్రత్యేకతలను నగర వాసులకు నిర్వాహకులు వివరించారు.
ఈ కార్ల ప్రత్యేకతలివే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న జరిగే ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌లో పాల్గొనే రెండ్లు కార్లను నిర్వాహకులు రెండు చోట్ల ప్రదర్శనకు ఉంచారు. దానిపై నగర వాసులకు అవగాహన కల్పించనున్నారు. జనరేషన్ 2 కారుగా చెప్పబడే ఈ కారు వేగం 2.8 సెకన్లలో 0-62 కి.మీ. చేరుకుంటుంది. కారు అత్యధిక వేగం 280 కి.మీటర్లు ప్రతి గంటకు ప్రయాణిస్తుంది. దీని పొడవు 5160 ఎంఎం, వెడల్పు 1770 ఎంఎం, ఎత్తు 1050 ఎంఎం ఉండగా, బరువు 900 కేజీలు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 385 కేజీలు ఉంటే … దాని శక్తి 200 కిలోవాట్లు. ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌కు హైదరాబాద్ ఎంపిక కావడంతో ప్రపంచంలోనే 12 నగరాల్లో ఒకటిగా ఉంటుంది. భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక నగరంగా నిలిచింది. వచ్చే ఏడాదితో పాటు మరో 4 ఏండ్ల పాటు హైదరాబాద్‌లోనే ఫార్ములా -ఈ కార్ రేసింగ్స్ జరిగేలా ఒప్పందం కుదిరింది.
ఉత్సాహంగా సాగిన హైదరాబాద్ సైక్లింగ్ రివల్యూషన్ 2.0
కేబుల్‌బ్రిడ్జిపై జెండా ఊపి ప్రారంభించిన
స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్
కొండాపూర్, సెప్టెంబర్ 25 : మాదాపూర్‌లోని దుర్గంచెరువు కేబుల్‌బ్రిడ్జిపై ఆదివారం ఉదయం హైదరాబాద్ సైక్లింగ్ రివల్యూషన్ 2.0 ఉత్సాహంగా సాగింది. ఈ సైక్లింగ్ ర్యాలీలో వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. సైక్లింగ్ రివల్యూషన్ 2.0కు పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. 23 కిలో మీటర్ల పాటు సాగిన ఈ సైకిల్ ర్యాలీ ఓఆర్ఆర్ సైకిల్ ట్రాక్, బైస్కిల్ లేన్స్ మీదుగా సాగింది. ర్యాలీలో చిన్న పిల్లలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా నగరంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఫార్ములా రేసింగ్‌లో పాల్గొనే కారును సందర్శకుల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు.