బేగంపేట్ సెప్టెంబర్ 9: గణేశ్ నిమజ్జనం లష్కర్లో కోలాహాలంగా సాగింది. జై బోలో గణేశ్ మహారాజ్‌కీ జై.. అంటూ విఘ్నేశ్వరుడిని కీర్తిస్తూ బొజ్జ గణపయ్య నామస్మరణలతో మార్మోగాయి. బేగంపేట్ సర్కిల్ పరిధిలో ఏర్పాటైన గణపతులను నిమజ్జనానికి తరలించారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, దాండియాలు, కోలాటాలతో, కళాకారుల డప్పు చప్పుళ్లు, తీన్మార్ డ్యాన్స్‌లతో సందడి చేసుకుంటూ ఉండ్రాలయ్యను నిమజ్జననానికి తరలించారు. ప్రతి ఒక్కరూ గణేశ్ నిమజ్జనంలో పాల్గొని సందడి చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి, మినిస్టర్ రోడ్డు, పికెట్ నుంచి వచ్చిన విగ్రహాలను మహాత్మాగాంధీ రోడ్డు మీదుగా గణేశ్‌లను ట్యాంకుబండ్‌కు తరలించారు. సికింద్రాబాద్, బేగంపేట్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన గణేశ్ విగ్రహాలు ఎంజీరోడ్డు, ఆర్పీ రోడ్డు , మినిస్టర్ రోడ్డుల మీదుగా ట్యాంక్‌బండ్‌కు తరలించారు. పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.
ప్రధాన రహదారుల్లో వేదికలు..
గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో భక్తులకు సేవలందించేందుకు పెద్ద ఎత్తున స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ, జలమండలి, వివిధ స్వచ్ఛంద సంస్థలు, వివిధ భక్తజన మండళ్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అసోసియేషన్ల నేతృత్వంలో సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్, మహాత్మాగాంధీ రోడ్, క్లాక్‌టవర్, ఎస్పీ రోడ్ తదితర ప్రాంతాల్లో వేదికలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌లో ఉప సభాపతి పద్మారావు రాంగోపాల్‌పేట్ మాజీ కార్పొరేటర్ అత్తెల్లి మల్లికార్జున్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, బండిమ్మెట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నాగేందర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన గణేశ్‌లను పండుగ వాతావరణంలో భారీ సెట్టింగ్‌ల నడుమ ఊరేగించారు. జిల్లాల నుంచి వచ్చిన పలువురు కళాకారులు చేపట్టిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గణేశ్ నిమజ్జన వేడుకలు వైభవంగా నిర్వహించారు.
జూబ్లీహిల్స్,సెప్టెంబర్9: గణేశ్ నిమజ్జన ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. వినాయక నవరాత్రోత్సవాలు ముగియడంతో భారీ ఊరేగింపులతో విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు.
కూడళ్ల వద్ద స్వాగత వేదికలు…
ఎర్రగడ్డ, సెప్టెంబర్ 9: నిమజ్జనానికి తరలుతున్న గణనాథులకు స్వాగతం పలికేందుకు పలు కూడళ్ల వద్ద శాంతి సంఘాల ఆధ్వర్యంలో స్వాగత వేదికలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎర్రగడ్డ శాంతి సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారి పక్కన భారీ వేదికను ఏర్పాటు చేశారు. బాలానగర్ ఏసీపీ గంగారాం, సనత్‌నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్, శాంతి సంఘం నేతలు గంట మల్లేశ్, నారాయణస్వామి, బాల్‌రెడ్డి, సంజీవ, మహ్మద్సర్దార్, నాగేశ్వరరావు, సుధాకర్, బాలకృష్ణ, గంట శ్రీను తదితరులు భరత్‌నగర్, బోరబండ తదితర ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్‌కు తరలుతున్న శోభాయాత్రకు స్వాగతం పలికారు.