సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : భారీ పోలీసు భద్రత మధ్య పాతబస్తీలో గణేశ్ విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం మక్కా మసీదు ప్రార్థనలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక్కొక్కటిగా చార్మినార్ వైపు వచ్చిన వాహనాలతో పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా భక్తులు పెద్దఎత్తున వినాయక నిమజ్జనానికి తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగర పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ బలగాలు చార్మినార్ చుట్టూ మోహరించాయి.
కేశవగిరినగర్ నుంచి మొదలైన బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, శాలిబండ, లాల్‌దర్వాజ మోడ్, చార్మినార్, గుల్జార్‌హౌజ్, మదీనా, అఫ్జల్‌గంజ్, మోజాంజాహీ మార్కెట్ మీదుగా ట్యాంక్‌బండ్‌కు తరలించారు. దీంతోపాటు పశ్చిమ మండం, దక్షిణ మండలం నుంచి వచ్చే వినాయక విగ్రహాల ఊరేగింపు సాఫీగా సాగేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు దగ్గర ఉండి పరిస్థితిని సమీక్షించారు. వర్షం కారణంగా వినాయక విగ్రహాల ఊరేగింపు కొంత ఆలస్యమైనప్పటికీ ఆట, పాటలతో నిర్వాహకులు ఊరేగింపును ఉత్సాహంగా నిర్వహించారు. రాత్రి 7 గంటల వరకు పాతబస్తీ మీదుగా సుమారు 6,321 వినాయక విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు తరలివెళ్లినట్లు అధికారులు తెలిపారు.