బడంగ్‌పేట, సెప్టెంబర్ 9 : విశ్వవ్యాప్తంగా పేరుగాంచిన బాలాపూర్ లడ్డూకు ఏటా క్రేజ్ పెరుగుతూనే ఉంది. వందలు..వేలు దాటి లక్షలకు చేరింది. శుక్రవారం నిర్వహించిన వేలం పాటలో బాలాపూర్ గణనాథుని లడ్డూను వీఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత, స్థానిక టీఆర్ఎస్ నాయకుడు వంగేటి లక్ష్మారెడ్డి రూ.24.60 లక్షలకు దక్కించుకున్నారు. ఉదయం 5 గంటలకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వంగేటి నిరంజన్‌రెడ్డి, ఉత్సవ కమిటీ నాయకులు ప్రత్యేక పూజలు చేసి వేలం పాట ప్రారంభించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు సబితారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి హాజరయ్యారు. 9 మంది లడ్డూ వేలంలో పేర్లు నమోదు చేసుకున్నారు. వంగేటి లక్ష్మారెడ్డి, సీఎంఆర్ షాపింగ్‌మాల్, పోరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జక్కిడి శివచరణ్, కార్పొరేటర్ ఎర్ర మహేశ్వరి జైహింద్, నవారు శ్రీనివాస్‌రెడ్డి, దాసరి దయానందరెడ్డి, మర్రి శశాంక్రెడ్డిలు పోటీపడగా..చివరకు రూ.24.60 లక్షలకు వంగేటి లక్ష్మారెడ్డి కైవసం చేసుకున్నారు. గతేడాది ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ రూ.18.90 లక్షలకు సొంతం చేసుకున్నారు. లడ్డూ దక్కించుకున్న అనంతరం లక్ష్మారెడ్డి హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు.
మంచి జరుగుతుందన్న నమ్మకం : వంగేటి లక్ష్మారెడ్డి
బాలాపూర్ లడ్డూ తీసుకుంటే మంచి జరుగుతుందన్న నమ్మకం ఉంది. గతంలో తీసుకున్న వారికి రుజువైంది. ఈ సంవత్సరం అవకాశం వచ్చింది. గణనాథుడి దయవల్ల అన్ని శుభాలు కలుగుతాయని విశ్వాసం.