హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : అభివృద్ధిలో అగ్రపథంలో కొనసాగుతున్న తెలంగాణలాగే దేశం మొత్తం పరిఢవిల్లాలంటే అది కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు మాగంటి గోపీనాథ్, శంభీపూర్ రాజు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి పెను మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని వారు పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
సీఎం కేసీఆర్ దూరదృష్టిగల నాయకత్వం దేశానికి అవసరం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని.. ప్రత్యేకించి హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేయవచ్చో చేసి చూపిన నాయకుడు కేసీఆర్. ఈ అభివృద్ధిని కళ్లారా చూసిన ప్రజలు కేసీఆర్ దేశానికి అవసరమని కోరుకుంటున్నారు. ఉచితాలు వద్దు అంటున్న మోదీ ప్రభుత్వం కావాలా.. దళితబంధు వంటి పథకాల ద్వారా అన్ని వర్గాలను అక్కున చేర్చుకునే నాయకుడు కావాలా.. అనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో దేశం కేసీఆర్ వైపే మొగ్గు చూపుతున్నది.
మినీ ఇండియా అనుభవం – మెగా ఇండియాను మెరిపిస్తుంది
మేడ్చల్- మలాజిగిరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు
హైదరాబాద్‌లో అన్ని రాష్ర్టాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్న విషయాన్ని దేశం గమనిస్తున్నది. మినీ ఇండియాగా పేరొందిన హైదరాబాద్ పురోగమన మాడల్ దేశానికి అవసరం. తెలంగాణను నడిపించినట్టే దేశాన్ని నడిపించాలని కేసీఆర్‌ను దేశమంతా కోరుకుంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.
కేంద్రంలో చేతల ప్రభుత్వం కావాలి
– రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
మోదీ మాటల ప్రభుత్వం. బీజేపీ మతవిద్వేష విధానాలను కూకటివేళ్లతో పెకిలించి వేయగల నాయకుడు దేశంలో ఒక్క కేసీఆర్ మాత్రమే. ఏడేండ్ల కాలంలో మోదీతో దేశంలో ఏ వర్గానికి మేలు జరగలేదు. మోదీది మాటల ప్రభుత్వం. సీఎం కేసీఆర్‌ది చేతల ప్రభుత్వమని తేలిపోయింది. దేశ ప్రజలు చేతల ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారు.