అబిడ్స్, సెప్టెంబర్ 9: బీజేపీ నాయకులు తమ రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ఊరుకోమని టీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్వీ మహేందర్‌కుమార్ హెచ్చరించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా మొజాంజాహి మార్కెట్లోని స్వాగత వేదికపై అసోం సీఎంను నిలదీసిన టీఆర్ఎస్ రాష్ట్ర నేత నందకిశోర్ వ్యాస్‌ను పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో టీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆర్వీ మహేందర్‌కుమార్, ఎం. ఆనంద్‌కుమార్‌గౌడ్, మంగళ్‌హాట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరీసింగ్, ప్రియాగుప్తా, శ్రీనివాస్ గౌడ్ తదితర నాయకులతో పాటు పార్టీ కార్యకర్తలు అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని.. నందకిశోర్ వ్యాస్‌కు మద్దతు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు ఆనంద్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ర్టాభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.