సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తేతెలంగాణ)/చార్మినార్ : మతసామరస్యానికి ప్రతీక భాగ్యనగరం. అన్ని మతాలు, కులాల వారు కలిసిమెలిసి జీవిస్తున్న చక్కటి కేంద్రం. మతం పేరుతో విద్వేషాలు రగిలించి రాజకీయ లబ్ధి పొందాలని కొన్ని శక్తులు తీవ్ర యత్నాలు చేస్తున్నా నగరవాసులు మనమంతా ఒక్కటే అన్న సందేశాన్ని ఇస్తున్నారు. శుక్రవారం స్థానిక మసీదుల్లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని జామియా నిజామియా సంస్థ నిర్వాహకులు ఫత్వా జారీ చేశారు. ఇరువర్గాల వారు పరస్పరం సహకరించుకుంటూ వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు లాల్ కమిటీ అధ్యక్షుడు ఖుబూల్ పాషాఖాద్రీ షెట్టారి తమ ఇంటి సమీపంలోని మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించుకోవాలని వీడియోల రూపంలో సందేశాన్ని విడుదల చేశారు.
ఇరువర్గాల ఉత్సవాలను పాతనగరంలో కలిసి నిర్వహించుకుంటాం. కొన్నిశక్తులు మాత్రమే దాన్ని జీర్ణించుకోలేపోతున్నాయి. శుక్రవారం జరిగే సామూహిక వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా సహకరిద్దాం. స్థానిక మసీదుల్లోనే ప్రార్థనలు చేయాలి.
మన సంస్కృతి చాలా గొప్పది. ఎన్నో ఏళ్లుగా ఒకరికి ఒకరం సహకరించుకుంటున్నాం. అదే ఒరవడిని కొనసాగిద్దాం. ఇక్కడ గంగా జమున తెహజీబ్ వారసత్వం ఇకముందు కొనసాగుతుంది. సామూహిక నిమజ్జనం సందర్భంగా సోదర వర్గానికి సహకరిద్దాం.
-మౌలానా ఖుబూల్ పాషా ఖాద్రీ