కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 8 : కూకట్పల్లి జంట సర్కిళ్లలో వినాయక నిమజ్జన వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, రెవెన్యూ, జలమండలి, ఇరిగేషన్, విద్యుత్, ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నిమజ్జనాలు జరిగే ప్రధాన చెరువుల వద్ద ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. వేలాది సంఖ్యలో నిమజ్జనాలు జరిగే కూకట్పల్లి రంగధాముని ఐడీఎల్ చెరవు, సున్నం చెరువు, బోయిన్పల్లి హస్మత్‌పేట చెరువు, ఆల్విన్‌కాలనీ ప్రగతినగర్ చెరువులలో నిమజ్జనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాలనీలు బస్తీల నుంచి ఊరేగింపుతో వచ్చే వాహనాలను క్రమపద్ధతిలో చెరువుగట్టు పైకి పంపించడం.. విగ్రహాలను చెరువులలో నిమజ్జనం చేయడం.. వేడుకల్లో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్లలో 4 చెరువులు, 3 కొలనుల వద్ద నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశారు. మూసాపేట రంగధాముని చెరువుగట్టుపై 7 పెద్ద క్రేన్లు, 2 మొబైల్ క్రేన్లు, 2 ఇటాచీలు, 1 జేసీబీ, సున్నం చెరువు వద్ద 1 క్రేన్, బోయిన్పల్లి హస్మత్‌పేట చెరువు వద్ద 2 క్రేన్లు, 1 ఇటాచీ, 1 జేసీబీ, ప్రగతినగర్ చెరువు వద్ద 2 క్రేన్లు, 1 ఇటాచీ, 1 జేసీబీ అందుబాటులో ఉంచారు. సాధారణ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి రంగధాముని, హస్మత్‌పేట, ప్రగతినగర్ కొలనులను సిద్ధం చేశారు. ఈ యేడాది కొత్తగా కూకట్పల్లి చిత్తారమ్మ దేవాయం ఆవరణలో మూడుఫీట్ల లోపు విగ్రహాలను నిమజ్జనం చేయడానికి పోర్టబుల్ ట్యాంక్‌ను సిద్ధం చేశారు. మరోవైపు చెరువుల వద్ద బారీకేడ్లు, విద్యుత్ దీపాలు, వివిధ విభాగల సమన్వయం కోసం క్యాంపు కేంద్రాలను సిద్ధం చేశారు. విగ్రహాల నిమజ్జనాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఉప కమిషనర్లు రవికుమార్, రవీందర్‌కుమార్‌లు తెలిపారు. 24గంటలు నిమజ్జనాలు చేసేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా కూకట్పల్లి జలమండలి పరిధిలో 13 కేంద్రాల ద్వారా 1.30 లక్షల వాటర్ ప్యాకెట్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. రంగధాముని ఐడీఎల్ చెరువు, సున్నం చెరువు, హస్మత్‌పేట చెరువు, ప్రగతినగర్ చెరువు పరిసరాలతో పాటు కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ వద్ద ప్రత్యేక కేంద్రాల ద్వారా వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేయడంతో పాటు ఆయా కేంద్రాల్లో డ్రమ్ములలో స్వచ్ఛమైన మంచినీటిని ప్రజలు తాగేందుకు అందించనున్నట్లు జలమండలి జీఎం అంబటి ప్రభాకర్ తెలిపారు.
వినాయక విగ్రహాలు నిమజ్జనాలు జరిగే చెరువు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా అత్యధింగా విగ్రహాలు నిమజ్జనం చేసే రంగధాముని (ఐడీఎల్) చెరువుగట్టుపై వాహనాల రాకపోకలకు అనుమతి లేదు. కేపీహెచ్‌బీ కాలనీ నుంచి వచ్చే వాహనాలు మూసాపేట వైపు.. మూసాపేట నుంచి వచ్చే వాహనాలు కూకట్పల్లి వైపు మాత్రమే వెళ్లాలి. చెరువుగట్టుపైకి వినాయక విగ్రహాలతో ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. నిమజ్జన వేడుకలను చూసేందుకు వచ్చే వాహనాలను కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అశోక బిల్డింగ్‌లో పార్కింగ్ చేయాల్సి ఉందన్నారు. అలాగే చెరువు పరిసరాలన్నీ సీసీ కెమెరాల నిఘాతో నిరంతరం పరిశీలించడం జరుగుతుందని ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్, కూకట్పల్లి సీఐ నర్సింగరావులు తెలిపారు.