సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో నిమజ్జనం కోసం ప్రభుత్వం అసలు ఏర్పాట్లే చేయలేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి తలసాని తీవ్రంగా దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న బెంగళూరులో వినాయక ప్రతిమల ఎత్తు కేవలం 8 ఫీట్లేనని అటువంటి ఆంక్షలు ఇక్కడ లేవని దీటైన సమాధానమిచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సారి కూడా ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేసిందని నగరవాసులకు, వినాయక ఉత్సవ నిర్వాహకులకు మంత్రి తలసాని స్పష్టం చేశారు. శుక్రవారం నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో బుధవారం ఎన్టీఆర్ మార్గ్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఓపెన్ టాప్ వాహనంలో మేయర్ విజయలక్ష్మితో కలిసి మంత్రి తలసాని పర్యటించారు.ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కర్ణాటక రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉందో ప్రజలకు తెలుసు.. బెంగళూరులో 8 అడుగుల వినాయకుడి ప్రతిమలను మాత్రమే ప్రతిష్టించాలి.. అందులో మట్టి వినాయకుడి విగ్రహమే ఉండాలి.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం వినాయక విగ్రహాల ఎత్తు విషయంలో ఎలాంటి ఆంక్షలను పెట్టలేదు..’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గణేశ్ నిమజ్జనానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. రాజకీయాల కోసం దేవుళ్లను అడ్డం పెట్టుకోవడం దుర్మార్గపు ఆలోచన అని బీజేపీ నేతలపై మంత్రి తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక చవితి ప్రారంభం నుంచి రేయింబవళ్లు ఏర్పాట్లలో నిమగ్నమైన ఉద్యోగులు, సిబ్బంది మనోైస్థెర్యం దెబ్బతినే విధంగా వ్యవహరించడం బాధాకరం అని అన్నారు.
హిందువుల పండుగలు అంటూ వేరుచేసి మాట్లాడుతున్నారని.. మేము హిందువులము కాదా.. అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు, ప్రవర్తనలను మానుకోవాలని మంత్రి తలసాని హితవు పలికారు. గణేశ్ ఉత్సవాల నిర్వాహకులను ఎందుకు అయోమయానికి గురి చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి అన్నారు. బుధవారం ఎన్టీఆర్ మార్గ్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఈ నెల 9వ తేదీన నిర్వహించే గణేశ్ నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఓపెన్ టాప్ వాహనంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , మీడియాతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అనంతరం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సంసృతి, సంప్రదాయాలను పెంపొందించే విధంగా అన్ని పండుగలను గొప్పగా జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ వస్తుందని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…
ధర్నా ఎందుకు చేస్తున్నరు.?
ధర్నా అసలు ఎందుకు చేస్తున్నరు.? ఎందుకు మోటర్ సైకిల్ ర్యాలీ చేస్తున్నరు.? వినాయక చవితి ఓ పవిత్రమైన పండుగ. వినాయక నవరాత్రుల విషయంలో హైదరాబాద్‌కు దేశంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఇంత బ్రహ్మాండంగా వేడుకలు ఎక్కడా జరగవు. 2014 తర్వాతనే మనం పండుగలను గొప్పగా నిర్వహించుకుంటున్నం. బాలాపూర్ వినాయకుడి నుంచి మొదలుకొని ఖైరతాబాద్ వినాయకుడి మార్గంలో ట్యాంక్‌బండ్ వరకు మనమందరం కలిసి చేసే ఆధ్యాత్మిక ర్యాలీ దేశంలో విశిష్టత సంతరించుకున్నది. అది మన ఐక్యతకు నిదర్శనం. టూరిజం, రెవెన్యూ, ఎండోమెంట్, పోలీసు విభాగాలన్నీ ఈ ఉత్సవాల విధుల్లో ఉన్నాయి. ఆరోగ్య శాఖ హెల్త్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నది. లాల్‌దర్వాజ, చార్మినార్, అఫ్జల్‌గంజ్, బేగంబజార్, ఐడీఎల్ ట్యాంక్, కూకట్పల్లి, ఎంజే మార్కెట్, అంబేద్కర్ మార్గ్, ట్యాంక్‌బండ్ , సరూర్‌నగర్, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో దారి పొడవునా ప్రభుత్వమే వేదికలను ఏర్పాటు చేసింది.
బెంగళూరులో 8 ఫీట్లే
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం 8 ఫీట్ల ఎత్తున్న వినాయకులనే పెట్టాలని.. అవి మట్టివే అయి ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అవి అక్కడ అమలవుతున్నయి కదా. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మన చెరువులను మనం సంరక్షించుకోవాలె. ఇందులో భాగంగానే మట్టి వినాయకులను ప్రోత్సహించాలని కేంద్రం కూడా కాలుష్య నియంత్రణ బోర్డు ద్వారా మార్గదర్శకాలు ఇచ్చింది. వాటినే పాటిస్తున్నం కదా. మన వద్ద వినాయకుల ఎత్తు తగ్గించాలని పోలీసులు ఎప్పుడూ చెప్పలేదు. అందరూ ఆనందంగా వినాయకులను ప్రతిష్ఠించుకున్నరు. కార్యక్రమాలు సవ్యంగా చేసుకుంటున్నరు. మరి ఎక్కడ, ఎవరు ఇబ్బంది పెట్టిండ్రో తెలుసుకొని మాట్లాడాలె. మట్టి వినాయకులను ప్రతిష్ఠించిన ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు హ్యాట్సాఫ్. ప్రభుత్వం ఇచ్చిన సూచనను అమలు చేసి వారు అందరికీ స్ఫూర్తిగా నిలిచిండ్రు.
దేవుండ్లను రాజకీయాల్లోకి లాగొద్దు..
ఎన్టీఆర్ మార్గ్‌లో గత రెండు మూడు రోజులుగా వినాయకుల నిమజ్జనాలు జరుగుతున్నయి కదా.? అది హుస్సేన్‌సాగర్ కాదా.? సాధారణంగా ఫైనల్ నిమజ్జనానికి రెండ్రోజుల ముందు అప్పర్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు చేస్తరు. ఐదు రోజులు, ఏడు రోజుల్లో తక్కువ సంఖ్యలో నిమజ్జనాలు అయితయి కాబట్టి ఆ మేరకే స్వల్ప ఏర్పాట్లు ఉంటయి. ప్రతిరోజూ నిమజ్జనాలు జరుగుతూనే ఉన్నాయి కదా. ఆ విషయం మీడియా కూడా గమనిస్తున్నది కదా.. మరి ఎక్కడ ఆపిండ్రు? ఎవరు ఆపిండ్రు? ఎవరో ఏదో మాట్లాడితే బాధ్యత గల వ్యక్తులు (ఎంపీ బండి సంజయ్) తెలుసుకోకుండా మాట్లాడితే ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం తగదు. మీరే హిందువులైతే మరి మేమెవరం.? ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. దయచేసి దేవుండ్లను రాజకీయాల్లోకి లాగొద్దు.
ప్రతి పండుగను గొప్పగ నిర్వహిస్తున్నం..
తెలంగాణ వచ్చినాంక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పండుగలు గొప్పగ జరుపుకోవాలని కోట్లాది రూపాయలు ఇస్తున్నరు. ప్రతి పండుగను భుజస్కంధాలపై వేసుకొని గొప్పగా నిర్వహిస్తున్నం. సిటీ మొత్తం 38వేల వినాయకులను ఏర్పాటు చేస్తే పోలీసులు ప్రతి మండపం వద్ద సెక్యూరిటీగ ఉన్నరు. సీసీ కెమెరాలు ఉన్నయి. లైటింగ్ ఉన్నది. 10 వేల మందికి పైగా శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు అవశేషాలు క్లియర్ చేస్తున్నరు. 24 గంటలూ పనిచేస్తున్నరు. వాళ్లకు మొక్కాలె. ట్యాంకుబండ్ వద్ద వంద మంది గజ ఈతగాళ్లను పెట్టినం. ప్రతి క్రేన్ వద్ద 14 మంది స్టాఫ్ ఉన్నరు. నిమజ్జనదారుల్లో ప్రభుత్వం వేదికలు ఏర్పాటు చేస్తే.. అవి తాము(బీజేపీ) వేయించినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా.? అని మంత్రి ప్రశ్నించారు.
మాట్లాడితే.. హిందూ పండుగలంటవ్. మరి మేం ఎవరం? హిందువులంటే మీరేనా? మేం హిందువులం కాదా? మొన్న జరిగిన మహంకాళి జాతర హిందువుల పండుగ కాదా? రేపొచ్చే బతుకమ్మ పండుగ ఎవరి పండుగ? దేవుండ్ల పేర్లు చెప్పి (ఎంపీ బండి సంజయ్‌ను ఉద్దేశించి)రాద్ధాంతం ఎందుకు చేస్తవ్? ఇంకెన్నాళ్లీ రాజకీయాలు? హైదరాబాద్ ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తవ్? వినాయక ప్రతిమలను పెట్టేవారిని ఎందుకు తికమక పెడ్తావ్? నిమజ్జన ఉత్సవాల కోసం ప్రభుత్వ అధికారులు నిద్రాహారాలు మానేసి కష్టపడుతూ ఉంటే వారిని నోటికొచ్చినట్టు తిట్టడం ఏం సంస్కారం? వినాయకుడి పండుగను, నిమజ్జనం ఏర్పాట్లను ప్రతిసారీ ప్రభుత్వమే చూసుకుంటున్నది కదా. ఏదేదో మాట్లాడి అనవసరంగా వివాదం ఎందుకు సృష్టిస్తున్నవ్. 9న జరిగే నిమజ్జనం రోజున నేను, మా మేయర్, ఇతర ప్రజాప్రతినిధులంతా ఇక్కడే అందుబాటులో ఉంటాం. – మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్