సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తూర్పు మధ్య బంగాళాఖాతం, పరిసర ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల బుధవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. రాత్రి 9గంటల వరకు అల్వాల్‌లోని మచ్చబొల్లారంలో అత్యధికంగా 9.3సెం.మీలు, అత్యల్పంగా గచ్చిబౌలిలో 1.0సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. రహదారులపై వర్షంనీరు చేరడంతో వెంటనే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్, మాన్సూన్ సిబ్బంది నీటిని తొలగించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండాట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. వరదనీరు మూసారాంబాగ్ బ్రిడ్జిని ముంచెత్తడంతో పోలీసు అధికారులు వాహనాలను దారిమళ్లించారు. వరదనీరు తగ్గేవరకు గోల్నాక బ్రిడ్జి మీదుగా వాహనాల రాకపోకలు సాగాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం రాగల 24గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో గ్రేటర్ పరిధిలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌కు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేశారు.