మారేడ్‌పల్లి, సెప్టెంబర్ 7: రైల్వేలో మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రాంతంలో భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ లలిత అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ 30వ జాతీయ సహాసభలో బుధవారం మహిళా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. రైల్వే శాఖలో వేలాది మంది మహిళా ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారని, వారికి కేంద్ర ప్రభుత్వం, రైల్వే బోర్డు కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎన్ఎఫ్ఐఆర్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య మాట్లాడుతూ కొత్త పెన్షన్ విధానం రద్దు చేయాలని, రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐఆర్ అధ్యక్షుడు గుమాన్ సింగ్, మహిళా నాయకురాలు వెంకటసుబ్బమ్మ, ఉపాధ్యక్షుడు భరణి భాను ప్రసాద్, షేక్ రవూఫ్, గీతా అయ్యర్, ఆదం సంతోష్, తదితరులు పాల్గొన్నారు.