మణికొండ, సెప్టెంబర్ 7: అల్కాపూర్ టౌన్షిప్ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని న్యాయస్థానం తీర్పును వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ తాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా ఓఆర్ఆర్ ఫేజ్-2 కింద అల్కాపూర్ టౌన్షిప్లో రిజర్వాయర్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ రిజర్వాయర్ నిర్మాణ పనులకు గత జనవరిలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కాగా, స్థానికులు కొంతమంది క్రీడాప్రాంగణంలో రిజర్వాయర్ నిర్మించవద్దంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంపై ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను న్యాయస్థానం దృష్టికి స్థానిక మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, కమిషనర్ ఫల్గుణ్కుమార్ తీసుకువెళ్లారు. న్యాయస్థానం ప్రజాసమస్యలపై స్పందిస్తూ అదే ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని తీర్పును వెలువరించింది.
ఈ నేపథ్యంలో బుధవారం స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. అల్కాపూర్ టౌన్షిప్లో తీవ్రంగా తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల పక్షాన తీర్పు రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ నిర్మాణం చేపట్టే ప్రాంతానికి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని పటాకులు పేల్చుతూ, మిఠాయిలు పంచిపెట్టారు. ఇక అల్కాపూర్‌లో తాగునీటి కష్టాలు తీరుతాయంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ కె.నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ స్వామి, కావ్య శ్రీరాములు, పార్టీ నాయకులు బి.శ్రీరాములు, ప్రమోద్‌రెడ్డి, నర్సింహ, విష్ణువర్ధన్ రెడ్డి, కాలనీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. అధికారులు పైపులైను పనులను చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరారు.
తక్షణమే పనులను ప్రారంభిస్తాం..
అల్కాపూర్ టౌన్షిప్ ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకొని రిజర్వాయర్‌ను నిర్మించాలని నిర్ణయించాం. స్థానికులు కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చివరకు న్యాయస్థానం నుంచి అనుకూలంగా తీర్పు వచ్చింది. తక్షణమే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.
– ఫల్గుణ్ కుమార్, మణికొండ మున్సిపల్ కమిషనర్