శామీర్పేట, సెప్టెంబర్ 7: వినాయ నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా శామీర్పేట పెద్ద చెరువు వద్ద పేరుకుపోయిన అవశేషాలను తొలగించేందుకు లాల్గడి మలక్పేట గ్రామపంచాయతీకి చెందిన కార్మికులను నియమించారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి పంచాయతీ కార్మికులైన డ్రైవర్ శంకరయ్య, కత్తి ఆంజనేయులు(45), కైర శివలక్ష్మి, లావణ్య, కమలమ్మ ట్రాక్టర్లో శామీర్పేట చెరువు వద్ద ఏర్పాటుచేసిన నిమజ్జన ఘాట్ వద్దకు బయలు దేరారు. బ్రిడ్జీ వద్దకు చేరుకోగానే వెనుకనుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన కత్తి ఆంజనేయులు, కైర శివలక్ష్మి, స్వల్ప గాయాలై డ్రైవర్ శంకరయ్య, లావణ్య, కమలమ్మలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆర్వీఎం ఆస్పత్రిలో ఆంజనేయులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శివలక్ష్మి వెన్నుపూసకు గాయం కావడంతో చికిత్స అందజేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేయడంతో డీపీవో రమణమూర్తి లాల్గడి మలక్పేట గ్రామ పంచాయతీని సందర్శించారు. అంత్యక్రియల కోసం మృతుడి కుటుంబ సభ్యులకు ఎంపీపీ ఎల్లూభాయిబాబు, డీపీవో రమణమూర్తి రూ.10 వేలు ఆర్థిక సాయంగా అందజేశారు.