సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) / ఖైరతాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలు అద్భుతంగా ఉన్నాయని అసోం ప్రజాప్రతినిధులు, అధికారులు కితాబు ఇచ్చారు. నగరంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అసోంకు చెందిన మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు ఖైరతాబాద్కు వచ్చారు. వీరికి తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్రావు స్వాగతం పలికారు. అనంతరం అసోం బృందం ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం ఇండ్లను, మీ సేవ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మురికివాడలు, పురాతన ఇండ్ల స్థానాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించడం ప్రభుత్వ దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. అదేవిధంగా మీ సేవ కేంద్రంలో అందుతున్న ఇ – గవర్నెన్స్ సేవలను వారు ప్రశంసించారు. తమ వద్ద 150 సేవలు మాత్రమే అందుతాయని, ఇక్కడ 600 వరకు సేవలు అందించడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. వారి వెంట నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రవిబాబు ఉన్నారు.