సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తేతెలంగాణ): ట్రాఫిక్ గజిబిజి, రోడ్డు పక్కనే దుకాణాలు, ఇష్టానుసారం పార్కింగ్‌లతో నగరంలో చాలా చౌరస్తాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సమీపంలో సిగ్నళ్లు ఉంటుండడంతో తరచూ ట్రాఫిక్ జాం అవుతోంది. దీన్ని నివారించేందుకు గ్రేటర్‌వ్యాప్తంగా జంక్షన్లను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. విదేశీ తరహాలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పాదచారుల భద్రతతోపాటు సులభంగా వెళ్లడం, వాహనాల వేగాన్ని తగ్గించడం, ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో జంక్షన్లను అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది.
నగరంలోని 13 ప్రదేశాల్లో రూ.33 కోట్ల అంచనా వ్యయంతో ట్రాఫిక్ జంక్షన్లను ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేయనున్నామని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ బుధవారం ట్విట్టర్లో వెల్లడించారు. రెండురోజుల క్రితం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాదచారుల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, జంక్షన్ల అభివృద్ధిపై సమీక్ష జరిపి ఆదేశాలు జారీ చేశారని అందులో చెప్పారు. ఈ సందర్భంగా నారాయణగూడ, నాగార్జున సర్కిల్, ఐడీపీఎల్, సంగీత్ థియేటర్ జంక్షన్ల అభివృద్ధి డిజైన్ల నమూనాను విడుదల చేశారు.
భవిష్యత్‌లో మరిన్ని కూడళ్లు
ఈ జంక్షన్ల అభివృద్ధితో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పాదచారుల భద్రతతోపాటు సులభంగా వెళ్లడం, వాహనాల వేగం తగ్గడం, తద్వారా ప్రమాదాలను చాలావరకు అరికట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న జంక్షన్లలో మంచి ఫలితాలు వస్తే భవిష్యత్తులో మరిన్ని ట్రాఫిక్ జంక్షన్లు అభివృద్ధి చేసేలా ముందుకెళ్తామని పేర్కొన్నారు.