సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తేతెలంగాణ) : భాగ్యనగరంలో ఇండ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సులువైన రవాణా సౌకర్యం, అన్ని యోగ్యతలున్న నగరం కావడంతో ఇక్కడే నివాసముండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నివాస గృహాల విక్రయాల్లో ఆగస్టు మాసంలో వృద్ధి రేటు పెరిగిందని నైట్‌ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో వెల్లడించింది. నివాస గృహాల విక్రయాలు, వాటి ద్వారా జరిగిన లావాదేవీల విలువతో కూడిన నివేదికను బుధవారం విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రూ.22,680 కోట్ల విలువ చేసే ఇండ్ల అమ్మకాలు జరిగాయని, ఇందులో ఒక్క ఆగస్టు మాసంలో రూ.2658 కోట్ల విలువ చేసే గృహాల అమ్మకాలు జరగగా, గ్రేటర్ చుట్టూ ఉన్న 4 జిల్లాలో 5181 అపార్టుమెంట్ ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయని వెల్లడించింది.
55 శాతం ఇళ్ల అమ్మకాల విలువ రూ.25-50 లక్షల వరకు ఉందని, 1000 చదరపు అడుగుల నుంచి 2000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన అపార్టుమెంట్లలోని ఫ్లాట్లు 72 శాతం నమోదైంది. మొత్తంగా హైదరాబాద్ కేంద్రంగా ఆగస్టు చివరి నాటికి 46,078 యూనిట్లు అమ్ముడుపోగా రూ.22,680 కోట్ల విలువైన అమ్మకాలు నివాస గృహాల మార్కెట్లో జరిగాయని నివేదికలో వెల్లడించింది. ఈ సందర్భంగా నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ వడ్డీ రేట్లు, ధరల పెరుగుదలతో అమ్మకాలపై ప్రభావం చూపినప్పటికీ నగరంలో ఇండ్ల అమ్మకాలకు మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. మున్ముందు ఉద్యోగ భద్రత, పెరుగుతున్న ఆదాయాలు, పొదుపుతో ఇంటి కొనుగోళ్ల సంఖ్య పెరిగి, ఇదే డిమాండ్ కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.